గూడు కూలుస్తారా? | - | Sakshi
Sakshi News home page

గూడు కూలుస్తారా?

Jul 20 2026 1:08 AM | Updated on Jul 20 2026 1:08 AM

గోడు చెబితే.. గూడు కూలుస్తారా? ● రణస్థలంలో గందరగోళంగా ఫ్లై ఓవర్‌ నిర్మాణం ● యుటిలిటీ కారిడార్‌ను మింగేస్తున్న అధికారుల యత్నాలు ● కలెక్టర్‌కు సమస్య వివరించడంలో హైవే అధికారులు విఫలం ● ఇళ్లకు ముప్పు ఉండటంతో ఆందోళనలో స్థానికులు

యుటిలిటి కారిడార్‌ తప్పనిసరి..

హామీ నిలబెట్టుకోవాలి..

గోడు చెబితే..
● రణస్థలంలో గందరగోళంగా ఫ్లై ఓవర్‌ నిర్మాణం ● యుటిలిటీ కారిడార్‌ను మింగేస్తున్న అధికారుల యత్నాలు ● కలెక్టర్‌కు సమస్య వివరించడంలో హైవే అధికారులు విఫలం ● ఇళ్లకు ముప్పు ఉండటంతో ఆందోళనలో స్థానికులు

రణస్థలం : రణస్థలం జంక్షన్‌లో చేపట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌(ఫ్లై ఓవర్‌) నిర్మాణంలో జాప్యం తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. అసంపూర్తి ప్రణాళికలు, కాంట్రాక్టర్ల, అధికారులు సమన్వయ లోపం వెరసి ఈ ప్రాజెక్టు ఇప్పుడు స్థానిక గృహ యజమానుల పాలిట శాపంగా మారింది. నిత్యం ట్రాఫిక్‌ ఏర్పడటంతో ఇటీవల సమస్య పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్‌కు హైవే ఆధికారులు సరైన రీతిలో చెప్పకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది. తాజాగా రోడ్డును ఆనుకుని ఉన్న ఇళ్లపైకి జేసీబీలను పంపేందుకు యంత్రాంగం సిద్ధం కావడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

చేతులెత్తేసిన హైవే అథారిటీ..

ఫ్‌లై ఓవర్‌ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధం చేసిన డీటెయిల్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ (డీపీఆర్‌) ప్రకారం పనులు మొదలయ్యాయి. 30 శాతం పనులకే కాంట్రాక్టర్‌ డీజిల్‌, తారు, ఇతర అవసరాలు అందించక, లేబర్‌ దొరక్క, పెరిగిన ధరలతో సతమతమై పనులు మందగించాయి. 2027 జూన్‌ 30లోగా కాంట్రాక్టర్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది.

టెండర్‌లో అవగాహన లేమి..

ఎన్‌హెచ్‌ఏఐ రూ. 254 కోట్లకు టెండర్‌ పిలవగా రూ.137 కోట్లకే శ్రీనివాస ఎడిఫేసీ ప్రైవేటు లిమిటెడ్‌ నిర్వాహకులు పనులు దక్కించుకున్నారు. కాంట్రాక్ట్‌ దక్కించుకోవాలనే తపనతో తక్కువకు టెండర్‌కు కోట్‌ చేశారు. ఇప్పుడు పెరిగిన ఇంధన, సిమెంట్‌, స్టీల్‌, తారు, క్రషర్‌ ధరల వలన నిర్మాణ వ్యయం 20 శాతం నుంచి 30శాతం వరకు పెరిగిపోవడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కారణంగా వెళ్లిన టెక్నికల్‌ కూలీలు తిరిగి రాలేదు. ఇదే సమయంలో బీహార్‌, యూపీ, ఒడిశాలో పనులు పెరగడంతో స్థానికంగా కూలీల కొరత తీవ్రమైంది.

కలెక్టర్‌కు వివరించలేని అధికారులు..

ట్రాఫిక్‌ సమస్యపై కలెక్టర్‌, ఎస్పీలు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో హైవే, కాంట్రాక్టర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో రోడ్డుకు ఇరువైపులా సుమారు 2 మీటర్ల యుటిలిటీ కారిడర్‌ వదలడం ఒక ప్రాథమిక ఇంజనీరింగ్‌ నియమం. భవిష్యత్‌లో ఈ స్థలంలో తాగునీటి పైపులు, గ్యాస్‌ పైపులైన్లు, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ తీగలు, టెలికమ్యూనికేషన్‌ పైబర్‌ కేబుల్స్‌ వేయడానికి, అలాగే డ్రైనేజీ యాక్సెస్‌కు, ప్రజా అవసరాల నిమిత్తం రిజర్వ్‌ చేస్తారు. ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు జిల్లా కలెక్టర్‌ సమీక్షలో వివరించలేకపోయారు.

పరిష్కరించమంటే కూల్చేస్తారా..

ఈ నిబంధనల మీద అవగాహన లేమితో, రోడ్డు వెడల్పు చేయడానికంటూ రోడ్డు పక్కన దశాబ్దాలుగా నివసిస్తున్న స్థానికుల గృహ నిర్మాణాలను తొలగించి ప్రస్తుత సర్వీస్‌ రోడ్డుని విస్తరించాలని కలెక్టర్‌ హుకుం జారీ చేశారు. రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం కూడా వెనకా ముందూ ఆలోచించకుండా ఈ ఇళ్లను కూల్చేందుకు సన్నాహలు మొదలెట్టింది.

ఆ హామీ ఏమైంది..?

గతంలో డీపీఆర్‌ సమయంలో స్థానికులు ఇదే తహసీల్ధార్‌ కార్యాలయంలో అప్పటి జేసీ సమక్షంలో తమ అభ్యంతరాలను లేవనెత్తినప్పుడు ప్రస్తుతం ఉన్న డ్రైనేజీల మధ్య పరిధిలోనే ఎలివేటెడ్‌ కారిడర్‌ నిర్మిస్తామని, ప్రజల ఇళ్లకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేసి, డ్రైనేజీలను ఏకంగా గృహ నివాసాల వైపు రెండు మీటర్ల వరకు జరిపి నిర్మిస్తామని చెబుతున్నారు. దీని వల్ల నివాసాలపైకి డ్రైనేజి నీరు, ఇళ్లపైకి హైవోల్టేజీ విద్యుత్‌ లైన్లు వచ్చే ప్రమాదం పొంది ఉంది.

డ్రైనేజీకి, మా ఇళ్లకు మధ్య కనీసం 1.5 నుంచి 2 మీటర్ల వెడల్పుతో పబ్లిక్‌ యుటిలిటీ కారిడార్‌ ఉండాలి. ఇప్పుడు ఖాళీగా కనిపించే ఈ స్థలాన్ని అధికారులు బలవంతంగా లాక్కుంటే, రేపు అండర్‌ గ్రౌండ్‌ కేబుల్స్‌, వాటర్‌ లైన్స్‌ వేయడానికి స్థలం ఉండదు. సమస్యను పరిష్కరించమని కలెక్టర్‌ను వేడుకుంటే ఉన్న ఇళ్లను కూల్చేసి కొత్త సమస్యను సృష్టించి వెళ్లారు.

– పిన్నింటి సత్యంనాయుడు, జే.ఆర్‌.పురం

నిర్మాణ సంస్థ లోపాలు, అధికారుల వైఫల్యాల వల్ల స్థానికులు, వ్యాపారులు నష్టపోయారు. మరలా గందరగోళం సృష్టించేలా చర్యలు చేపట్టడం, సామాన్యులను బలిపశువులను చేయడం ఎంతవరకు న్యాయం? కొత్తగా లోపలికి డ్రైనేజీ వేస్తామని, ఇళ్లపైకి జేసీబీలను పంపిస్తామని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో హైవే అధికారులు కాలువ దాటి రాబోమని చెప్పిన హామీ నిలబెట్టుకోవాలి.

– పచ్చిగుల్ల సాయిరాం,

ఎంపీటీసీ సభ్యుడు, జె.ఆర్‌.పురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement