జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరిలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రథమ భీమ భొయి దివ్యాంగ సామర్థ్య శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. సమాజంలో వికలాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సహాయ, సంక్షేమ కార్యక్రమాల ద్వారా లభించే లబ్ధిని వివరించారు. వారిని చైతన్యవంతులను చేయాలన్న లక్ష్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ శిబిరంలో అనేక మంది దివ్యాంగులు పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు చేపట్టి ప్రమాణ పత్రాలను అందజేశారు. పరికరాలు సమకూర్చేందుకు వికలాంగులను గర్తించారు. 234 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. వికలాంగులకు అవసరమైన మూడు చక్రాల సైకిళ్లు, హ్యాండ్ స్టిక్స్, శ్రవణ యంత్రాలు, తదితర పరికరాలు అందజేశారు.
దుకాణాల్లో తనిఖీలు
జయపురం: రథయాత్ర సందర్భంగా జయపురంలోని స్వీట్స్, తదితర దుకాణాల్లో ఆహార సురక్షా విభాగ అధికారులు, జయపురం మున్సిపాలిటీ హెల్త్ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పరిశుభ్రమైన పదార్థాలు విక్రయించాలన్నారు. పాలిథిన్ కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొరాపుట్ జిల్లా ఖాద్య సురక్షా అధికారి పంకజనీ బెహర, జయపురం మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


