నందిగాం: మండల కేంద్రం నందిగాంకు చెందిన కొన్ని బాలయ్య (107) శనివారం రాత్రి మృతి చెందాడు. ఈయన కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. బాలయ్యకు ముగ్గురు కుమారులు, కుమార్తె. ఇద్దరు కుమారులు మృతి చెందగా.. భార్య వరలక్ష్మీ జీవించి ఉన్నారు.
వందేభారత్ రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
నరసన్నపేట: ఉర్లాం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం భువనేశ్వర్ నుంచి విశాఖ వెళ్తున్న వందేభారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు. మృతుడి వయసు 55 ఏళ్లు ఉండవచ్చని చెప్పారు. టీ షర్ట్, టవల్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే 91103 05494 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
కుక్కల దాడిలో మేకలు మృతి
టెక్కలి రూరల్: టెక్కలి గొల్లవీధిలో ఆదివారం వేకువజామున కుక్కలు స్వైర విహారం చేశాయి. బారికోడుకి చెందిన శాలలో చొరబడి దాడి చేయడంతో ఆరు మేకలు, ఐదు గొర్రెలు మృతిచెందాయి. మరికొన్ని గాయపడ్డాయి.
రైలు కింద పడి వ్యక్తి మృతి
పలాస: సోంపేట రైల్వేస్టేషన్ యార్డు డౌన్ లైన్‌లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు జి.ఆర్.పి ఎస్‌ఐ దుంపల శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఆకుపచ్చ టీషర్టు, నలుపు ఫ్యాంటు, టీ షర్టుపై శ్రీకృష్ణా ఏజెన్సీ, రాయగడ అని ఉందన్నారు. కుడి చేతిలో కియా, సోని పేరిట పచ్చబొట్టు ఉందని చెప్పారు. వివరాలు తెలిస్తే 9247585743 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
అరసవల్లి : శరీరంలో కనిపించే చిన్నవాపుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ‘సార్కోమా’ రూపంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశాఖకు చెందిన ప్రముఖ రేడియేషన్ అంకాలజీ వైద్యుడు డాక్టర్ ఎం.వెంకటరమణ అన్నారు. ఏటా జూలై నెలను ప్రపంచ సార్కోమా అవగాహన మాసంగా జరుపుకుంటారు. ‘తెలుసుకోండి.. చర్య తీసుకోండి..గొంతెత్తండి..’ అనే థీమ్‌తో ఈ నెల ప్రత్యేకంగా అవగాహన కల్పించేందుకు వైద్యులు సంసిద్దమయ్యారు. ఈ సందర్భంగా వెంకటరమణ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
సార్కోమా లక్షణాలివే..
సాధారణంగా క్యాన్సర్‌లు రొమ్ము, లివర్, ఊపిరితిత్తులు,పేగు వంటి లోపల పొరల్లో పుడతాయి. సార్కోమా మాత్రం కండరాలు, ఎముకలు, కొవ్వు కణాలు, రక్త నాళాల్లో పుడుతుంది. నెమ్మదిగా పెరిగి, నొప్పి లేని వాపు, గడ్డగా కనిపిస్తుంది. క్రమేణా చేతులు, కాళ్లు కదిలించడంలో ఇబ్బంది పెడతాయి. కడుపు ఉబ్బడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం కూడా వీటి లక్షణాలే. ఎముకల్లో రాత్రి వేళ నొప్పులు, చిన్నపాటుకే ఎముకలు విరగడం వంటివి కూడా ప్రధాన లక్షణాలు. కచ్చితంగా వాపు గడ్డ కనిపిస్తే..అందులో నొప్పి లేదంటే తప్పకుండా బయాప్సీ చేయించాల్సి ఉంటుంది. రేడియేషన్ అంకాలజిస్ట్, సర్జికల్ అంకాలజిస్టు, పాథాలజిస్టు, రేడియాలజిస్టుల బృంద వైద్యులు కలిసి చికిత్స చేయాల్సి ఉంటుంది. గడ్డగా మారిన కణితిని పూర్తిగా తొలిగించేలా ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన వైద్యులతోనే సార్కోమా చికిత్స చేస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు.
తల్లి లేని లోకం వద్దని..
సోంపేట: తల్లి మృతిచెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోంపేట మండలం బారువ మేజర్ పంచాయతీ పరిధిలోని బారువ కొత్తూరు గ్రామానికి చెందిన వలిశెట్టి జోగారావు, మంగమ్మల కుమారుడు అనీష్(20). విజయనగరం సెంచూరియన్ యూనివర్సిటీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి జోగారావు బీఎస్‌ఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేయడంతో అనీష్‌కు తల్లితోనే అనుబంధం ఎక్కువ. ఆరు నెలల క్రితం తల్లి మంగమ్మ కొర్లాం జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అప్పటి నుంచి అనీష్ ముభావంగా ఉండేవాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. రెండు రోజుల క్రితం విజయనగరం నుంచి రథయాత్ర సందర్భంగా ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం కొర్లాం సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు వెళ్లి గుర్తు తెలియని రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అనీష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.


