శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం మండలం చాపురం పంచాయతీ బలగ బౌండరీలో సర్వే నంబరు 35/1లో ప్లాట్లను ఫేక్ ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి కబ్జాకు యత్నించిన 8 మంది నిందితులను రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. సర్వే నంబరు 35/1లో అంధవరపు గోవిందరాజులు, వారి సోదరులు తాలుకా దాదాపు 20 ఎకరాల లేఅవుట్‌లో 84, 85, 86 నంబర్లు గల ప్లాట్లలో 900 గజాల స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో చేజిక్కించుకోవడానికి చూశారని, ఈ విషయంపై ప్లాట్ల యజమాని కట్టా కనక లింగేశ్వరరావు కుమారుడు కట్టా జయకిషోర్ రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ కేవీ సురేష్ కేసు నమోదు చేశారు. పోలీసులు తమ విచారణలో ఈ కేసుకు సంబంధించి మొత్తం 13 మంది నిందితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించి 8 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అడబాల రజిని, తెలుగు సతీష్‌కుమార్, సాలిపిల్లి లక్ష్మణరావు, ముద్దాడ ఉపేంద్రకుమార్, జెగురిపాటి ఉపేంద్రరావు, మామిడి గోపాల కృష్ణ, సాంబాన సాంబశివరావు, డాక్యుమెంటరీ రైటర్ కూన పెద్దిరాజులున్నారు. మిగిలిన వారిపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
మందస ఘటనపై అవాస్తవాలు నమ్మొద్దు..
మందసలో ఈ నెల 13న జరిగిన ఘటనపై అసత్య ప్రచారాలు, అవాస్తవాలు నమ్మవద్దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. దీనికి సంబంధించి సీసీఫుటేజీ, కాల్‌డేటా, కాల్‌వాయిస్ రికార్డు ఎంఎల్‌సీ, బాధితుల స్టేట్‌మెంట్లన్నీ ఆధారాలతో సహా ఉన్నాయన్నారు. కార్యాలయంలో సీసీ ఫుటేజీ రెండు మూడు చోట్ల చూపించినా స్పష్టత లేకపోవడం, కాల్‌వాయిస్ రికార్డ్ వినిపించకపోవడం వంటి వాటిని విలేకరులు ప్రశ్నించారు.
కాశీబుగ్గ సీఐ, ఎస్‌ఐల సస్పెన్షన్
ఇటీవల కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పారిశ్రామికవాడలో జరిగిన ప్రమాద ఘటన కేసుకు సంబంధించి సీఐ వై.రామకృష్ణతో పాటు ఎస్‌ఐ సునీల్‌ను శనివారం అర్ధరాత్రి సస్పెన్షన్ చేసినట్లు విలేకర్లకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ప్రమాదం జరిగిన నాటినుంచి ఎవరెవరు సెటిల్‌మెంట్‌లో పాల్గొన్నారు. ఎవరెవరి పాత్ర ఎంతవరకుందన్న దానిపై విచారణ చేస్తున్నామని ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.


