శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ)/శ్రీకాకుళం: నీట్ పరీక్ష పేపర్ లీకేజీతో పాటు ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని జిల్లా ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ, ప్రజా సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ రోడ్డు జంక్షన్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. శాంతియుత నిరసనను అణచివేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జూలై 20న నిర్వహించనున్న ‘ఛలో పార్లమెంట్‘ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు, కో–కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బడే కామరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు కానుకుర్తి గోవింద, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు రాకోటి రాంబాబు, రెల్లి కుల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఆర్.జి.కోటి, జలుమూరు కొండలరావు, తిరుపతిరావు, అనంతరావు, వదినగిరి, ఎడ్ల జానకిరావు, విదసం రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల గోపి, జన సాహితి, జిల్లా బాధ్యులు పి. మోహన్‌రావు పాల్గొన్నారు.


