ఎట్టకేలకు ఇంద్రావతి–విశాఖపట్నం ఓఎస్‌ఆర్టీసీ బస్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ఇంద్రావతి–విశాఖపట్నం ఓఎస్‌ఆర్టీసీ బస్‌ ప్రారంభం

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

కొరాపుట్‌: ఎట్టకేలకు ఇంద్రావతి–విశాఖపట్నం ఓఎస్‌ఆర్టీసీ బస్‌ ప్రారంభమైంది. బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి ప్రారంభ పూజలు చేసి బస్‌ ప్రారంభించారు. నబరంగ్‌పూర్‌ జిల్లా తెంతులకుంటి సమితి ఖాతీగుడ (ఇంధ్రావతి) నుంచి నేరుగా విశాఖ పట్నం కోసం చాలా కాలంగా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో అప్పర్‌ ఇంద్రావతి హైడ్రో ఎలక్రసీటీ పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నాలుగు ఏపీఎస్‌ ఆర్‌టీసి బస్సులు విశాఖ పట్నం నుంచి నేరుగా నడిపింది. ఈ బస్సులు సుమారు 35 ఏళ్ల పాటు నడిచాయి. అనంతరం కాల క్రమేణా ఈ బస్సులు కుదిస్తూ వచ్చారు. కరోనా సమయం నుంచి పూర్తిగా రద్దు చేశారు. దాంతో విశాఖ పట్నం వైద్య, విద్య, ఇతర పనుల కోసం వేళ్లే వారు నబరంగ్‌పూర్‌ వచ్చి విశాఖ పట్నం బస్సులు ఎక్కుతున్నారు. తమకు నేరుగా విశాఖ పట్నం బస్సు కావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ సమస్యని ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి తాను గెలిచిన తర్వాత పరిష్కరిస్తానని గత ఎన్నికలలో ఇంధ్రావతి ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బస్సు ఏర్పాటు చేశారు. ఈ బస్సు ప్రతి రోజు రాత్రి 8.20 కి ఇంద్రావతి నుంచి బయల్దేరుతుంది. బస్సు ప్రారంభ సమయం లో ఎంఎల్‌ఎ మాట నిలబెట్టుకున్నందున్న ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్న విశాఖ పట్నం–రాయ్‌పూర్‌ భారత మాల ఆరు అంచెల జాతీయ రహదారిని పరిశీలించారు. అక్కడ మండుటెండలో పని చేస్తున్న మహిళా కార్మికులతో సంభాషించారు. వారికి అందుతున్న సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల భద్రతకి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement