నేటి నుంచి ఓటరు జాబితా
రాయగడ: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం మూడో దశను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఈ మేరకు కలెక్టర్ అఽశుతొష్ కులకర్ణి శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మే 20 నుంచి ప్రారంభమైన ప్రాథమిక సన్నాహాలు ,శిక్షణ కార్యక్రమాలు, ముద్రణ పనులు మే 29 తో పూర్తయ్యాయని వివరించారు. అనంతరం మే 30 వ తేదీ నుంచి జూన్ 28 వ తేదీ వరకు జిల్లాలొని అన్ని బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరించారని చెప్పారు. ఈ సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని వివరించారు.జూలై 5 న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుందని తెలిపారు. జూలై 5 నుంచి ఆగస్టు 4 వరకు కొత్త పేర్ల నమోదు, సవరణలు, అభ్యంతరాల దాఖలుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అందిన దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన జూలై 5 నుంచి సెప్టెంబరు 2 వరకు కొనసాగుతుంది. అనంతరం అన్ని ప్రక్రియలు పూర్తి చేసి సెప్టెంబరు 6 వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించేందుకు బీఎల్‌ఓల కొసం ప్రత్యేక మార్గ దర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి కుటుంబాన్ని సందర్శించి భౌతికంగా ధ్రువీకరణ చేపట్టడంతో పాటు, గైర్హాజరు, ఇతర ప్రాంతాలకు మారిన, మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించి ప్రత్యేక జాబితా సిద్ధం చేయనున్నారు. అలాగే కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6, పేర్ల తొలగింపునకు ఫారం –7, వివరాల సవరణకు ఫారం –8 లను పంపిణీ చేసి పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల సౌకర్యాలు, దూరం, దివ్యాంగులు, వృద్ధులకు అందుబాటు వంటి అంశాలను కూడా బీఎల్‌ఓలు పరిశీలించనున్నట్లు చెప్పారు. దీని ద్వార ఎన్నికల ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


