గంగమ్మ ఉత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

గంగమ్మ ఉత్సవాలు ప్రారంభం

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

రాయగడ: స్థానిక పిట్లవీధిలో గల అగ్ని గంగమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆదివాసీ మేళతాళాలతో, పండితుల వేదమంత్రాలతో అమ్మవారి పాదాలను స్థానిక కేఎన్‌కే సమీపంలో గల పాదాల గుడి నుంచి తీసుకువచ్చారు. ఐదు రోజుల పాటుగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం నుంచి అమ్మవారి ప్రతీకలైన ఘటాలు పురవీధుల్లో ఊరేగిస్తారు. బుధవారంతో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు.

చెట్టుపై నుంచి జారి పడి విద్యార్థి మృతి

రాయగడ: జామకాయలు కోసేందుకు చెట్టెక్కిన విద్యార్థి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందిన ఘటన జిల్లాలోని ఒంటరిగడు గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడిని గణేష్‌ ముదలి (13 )గా గుర్తించారు. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అందిన వివరాల ప్రకారం.. ఒంటరిగుడ ప్రాథమిక పాఠశాలలో 5 వ తరగతి చదువుతున్న గణేష్‌ శుక్రవారం తన స్నేహితులతో కలసి జామకాయలు కోసుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో విద్యార్థి ప్రమాదవశాత్తు కాలుజారి చెట్టుపై నుంచి కిందకు పడిపోయాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బరంపురంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

నిందితుడికి రెండున్నరేళ్ల జైలు శిక్ష

రాయగడ: ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడికి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తు రాయగడ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆశీస్‌ పట్నాయక్‌ శుక్రవారం తీర్పునిచ్చారు. నిందితుడు రాజేంద్ర దీప్‌కు రూ.ఐదు వేల జరిమానా చెల్లించాలని, లేని పక్షంలో అదనంగా మరో మూడు నెలలపాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది డిసెంబర్‌ 13వ తేదీన చందిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జేకేపూర్‌ ప్రాంతంలో మహిళా హోంగార్డు రీనా బిడిక ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న సమయంలో బైక్‌ను ఆపేందుకు ప్రయత్నించగా.. బైకు నడుపుతున్న రాజేంద్ర దీప్‌ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. అనంతరం తిరిగి అక్కడి వచ్చి రీనా బిడికపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రీనాను రాయగడ జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి రాజేంద్రను అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన జడ్జి ఈ మేరకు తీర్పునిచ్చారు.

ఆరుగురు మృతిపై నివేదిక ఇవ్వండి

భువనేశ్వర్‌: సెప్టిక్‌ ట్యాంక్‌లో ఊపిరాడక ఆరుగురు మరణించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి, కలహండి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సవివరమైన నివేదికను కోరింది. ఈ నెల 26న కలహండి జిల్లా గౌడ కర్లఖుంట గ్రామంలో నిర్మాణ పనుల కోసం మేసీ్త్రలు సెప్టిక్‌ ట్యాంక్‌ను తెరిచి పని చేసేందుకు లోపలికి వెళ్లిన కార్మికుడు ఊపిరాడక చిక్కుకున్నట్లు గమనించి కాపాడేందుకు తోటి కార్మికులు ట్యాంక్‌లోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి జాతీయ మానవ హక్కుల సంఘం స్వయంగా చొరవ కల్పించుకుంది.ఈ విషయంపై రెండు వారాల్లోగా సవివరమైన నివేదికను సమర్పించాలని కోరుతూ, కమిషన్‌ ఒడిశా ముఖ్య కార్యదర్శికి మరియు కలహండి పోలీస్‌ సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది. జాతీయ మానవ హక్కుల సంఘం కోరిన నివేదికలో దర్యాప్తు స్థితి, గాయపడిన కార్మికుడి ఆరోగ్యం, అలాగే బాధితులకు చెల్లించిన నష్ట పరిహారం వివరాలు ఉండాలని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement