జయపురం: ఎం.ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం జయపురం వారి ఆధ్వర్యంలో ఆవు పేడతో ఉత్తమ ఎరువులు తయారీపై రైతులకు శుక్రవారం శిక్షణ శిబిరం నిర్వహించారు. దేశంలో రసాయనిక ఎరువుల కొరత, సరఫరాలో సమస్యలను దృష్టిలో ఉంచుకొని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ప్రధాన మంత్రి పిలుపు మేరకు తమ సంస్థ ఆవు పేడతో ఉత్తమ సహజ ఎరువులు తయారీ శిక్షణ శిబిరం నిర్వహించిందని ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ జయపురం కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కార్తి చరణ లెంక వెల్లడించారు. ఎరువుల కొరత, అధిక వ్యవసాయ ఖర్చు, ఇతర దేశాల రసాయిక ఎరువులపై ఆధార పడటం వలన రైతులకు అధిక భారం అవుతుందన్నారు. ఎం.ఎస్ స్వామినాథన్ రిసేర్చ్ ఫౌండేషన్ కేంద్రం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సహజ వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వాటిలో కొరాపుట్ జిల్లా రైతులను మమేకం చేస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా స్థానిక వనరుల ఆధారిత వ్యవసాయం, జైవిక ఎరవులు, సంప్రదాయ పద్ధతుల ద్వారా మట్టి సారవంతాన్ని మెరుగుపరచటం, తద్వారా వ్యవసాయ ఖర్చు తగ్గించటం ద్వారా ధీర్ఘకాలిక వ్యవసాయ స్థిరత్వం ఏర్పడుతుందని వెల్లడించారు. ఈ శిక్షణా శిబిరంలో కొరాపుట్ గ్రామ పంచాయతీ నుంచి 50 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం మాజీ అధికారి, జిల్లా ఉద్యానవన విశ్రాంత అధికారి ఎస్.బి.రమణ, తదితరులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన రైతలకు ఆవుపేడతో ఎరువులు తయారీ చేసేందుకు ఉపయోగ పడే యంత్రాలను అందించారు.


