నేటి నుంచి రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

భువనేశ్వర్‌: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్‌. ఎస్‌. గోపాలన్‌ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఈఓ మాట్లాడుతూ ఈ ప్రక్రియ జూన్‌ 28 వరకు నిరవధికంగా కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 కోట్లకు పైగా ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయింది. ఈ ప్రక్రియలో సుమారు 17 శాతం లోపాలు గుర్తించారు. నేటి నుంచి బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ప్రతి ఇంటినీ సందర్శించి సవరణలు చేస్తారని గోపాలన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరుకు 2 ఫారాలు అందజేస్తారు. ఒక కాపీని ఓటరు తన వద్ద ఉంచుకుని, మరొక కాపీని సంబంధిత బీఎల్‌ఓకు సమర్పించాలి. ఓటరు పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, చిరునామా లేదా ఫోటోలో ఏవైనా తప్పులు ఉంటే, వాటిని అక్కడికక్కడే సరిదిద్దడంలో బీఎల్‌ఓ సహాయం చేస్తారు. ఓటర్లు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ voterr.eci.gov.in నుంచి ఫారాలను డౌన్‌లోడ్‌ చేసుకుని, వాటిని నింపి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కూడా చేయవచ్చు. ఫారాలు నింపడంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓటర్లకు బీఎల్‌ఓలు పూర్తి సహాయాన్ని అందిస్తారు. భారత పౌరులు కాని వారిని ఓటర్ల జాబితా నుండి నేరుగా తొలగిస్తామని సీఈఓ తెలిపారు. బీఎల్‌ఓలు 3,33,99,591 గృహాలను సందర్శించి 31,026 మంది బూత్‌ స్థాయి ఏజెంట్ల సహకారంతో పని చేస్తారు. బీఎల్‌ఓలు ఉదయం ఇంటింటికీ వెళ్లి ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ తమ బూత్‌లలో అందుబాటులో ఉంటారు. మ్యాపింగ్‌ పూర్తయిన ఓటర్లు, బీఎల్‌ఓ సందర్శన సమయంలో తమ సంతకంతో ఫోటో అందించాల్సి ఉంటుంది అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement