‘ప్రకృతి సంపద దోచుకుంటున్నారు’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రకృతి సంపద దోచుకుంటున్నారు’

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

రాయగడ: అపారమైన ఖనిజ సంపదలు గల ఒడిశాలో పరిశ్రమల పేరిట వాటిని దోచుకుంటున్నారని ఒడిశా పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ అన్నారు. స్థానిక అశోక్‌ మండపంలో గురువారం నాడు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అధ్వర్యంలో జరిగిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని డబల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పై విరుచుకుపడ్డారు. పరిశ్రమలు నెలకొల్పే నెపంతో ఖనిజ, ప్రాకృతిక సంపదలను హరించి వేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అడ్డుకున్న ఆదివాసీలపై తప్పుడు కేసులు పెట్టి వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలొ అడ్డుదోవలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అవిభక్త కొరాపుట్‌ జిల్లా ఎప్పుడూ కాంగ్రెస్‌కు కంచుకోటగానే నిలుస్తుందని అన్నారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయని దాస్‌ అన్నారు. పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుండే వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని కొరాపుట్‌ లొక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలక కోరారు. మొబైల్‌ టవర్ల ఏర్పాటు, గుణుపూర్‌–తెరువలి రైలు మార్గం వంటి అభివృద్ధి పనులు కాంగ్రెస్‌ నాయకుల ప్రయత్న ఫలమేనన్నారు. సమావేశంలో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు బలభద్ర మాఝి, పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గా ప్రసాద్‌ పండ, కొరాపుట్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రూపక్‌ తురుక్‌, రాయగడ జిల్లా మహిళా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు నంది గౌరి, సీనియర్‌ నాయకులు చంద్రమౌళి కుముంధాన్‌, వివిధ సమితులకు చెందిన కాంగ్రేస్‌ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement