న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
మజ్జిగౌరి అమ్మవారికి..
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మంగళవారం కావడంతో మందిరంలో విశేష పూజలను నిర్వహించారు. స్వర్ణాలంకరణ, సింధూర రంగులో ధగధగా మెరుస్తున్న అమ్మవారి దివ్యమైన రూప దర్శనం భక్తులను తన్మయత్వానికి గురి చేసింది. చైత్రోత్సవాల్లో మంగళవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో పూజారులు వంట శాలలో ప్రత్యేకమైన వంటలను చేసి అమ్మవారికి భోగాన్ని సమర్పించారు. అన్నం, పప్పు, కలగాయ కూరతో పాటు కక్కరాలు, పాయసం (ఖిరీ) వంటివి నైవేద్యంగా సమర్పించారు. పూజారి వీధిలో ఉన్న మహిళలు కూడా చైత్రమాసం ఆఖరి మంగళవారం కావడంతో ఇంటిలో తయారు చేసిన పిండివంటలతో పాటు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన నెయ్యిలు (మరమరాలు)తో తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పించారు. భోగం సమర్పించే సమయంలో సుమారు గంట సమయం వరకు (మధ్యాహ్నం) దర్శనాన్ని నిలిపివేస్తారు. అమ్మవారి గర్భగుడి తలుపులను పూర్తిగా మూసి అమ్మవారికి భోగంతో పాటు తయారు చేసిన వివిధ వంటకాలను అమ్మవారి ముందు పెట్టి తలుపులను తిరిగి మూసి వేస్తారు. అనంతరం కొంత సేపు తర్వాత పూజారి ముందుగా గర్భగుడి ప్రధాన ద్వారాన్ని తట్టిన తర్వాత తెరుస్తారు. గర్భగుడి లోపలకు వెళ్లిన పూజారి అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత హారతినిస్తారు. అనంతరం అమ్మవారి దర్శనం యథాతథంగా రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది.
ప్రారంభమైన చండీ హోమం
అమ్మవారి చైత్రోత్సవాల్లో ప్రధాన ఘట్టం చండీ హోమం. మంగళవారం నుంచి హోమ కార్యక్రమం కొనసాగింది. మందిరం ప్రాంగణంలో ఉన్న మండపంలో పూజా కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పురొహితులు హోమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం రాత్రి పూర్ణాహుతి జరుగుతుంది. దీంతో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాయిసింగి బిడిక, కమిటి సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, వడ్డాది శ్రీనివాస్ రావు, పాలకొండ ప్రకాష్, పెద్దీన వాసు దంపతులు పాల్గొన్నారు. అంతకు ముందు పురోహితులు మందిరం ప్రాంగణంలో వేసిన సూర్య చక్రం మధ్యలో కలశం ఉంచి సూర్య ఆవాహన, విశేష పూజలను నిర్వహించారు.


