భువనేశ్వర్: బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసన సభలో మంగళవారం గందరగోళం నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా సభ నినాదాలతో మార్మోగింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం నుంచే బిజూ జనతా దళ్ (బీజేడీ), కాంగ్రెస్ పార్టీలకు చెందిన సభ్యులు సభలో నినాదాలు చేశారు. ఈ గందరగోళానికి తోడుగా, సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం సమీపంలో నిరసన చేపట్టారు. దివంగత నాయకుడికి సంఘీభావం, గౌరవం తెలుపుతూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. నిరసనలు ఆగకుండా కొనసాగడంతో స్పీకర్ సభను ఉదయం 11.30 గంటల వరకు వాయిదా వేశారు. పార్లమెంట్ సభ్యుడు నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పథ్వీరాజ్ హరిచందన్ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలను అనుచితమైనవిగా, ఆమోదయోగ్యం కానివిగా పేర్కొన్నారు. బిజూ పట్నాయక్ గురించి ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ప్రతికూల వ్యాఖ్యలను ప్రభుత్వం గమనించింది. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆ వ్యాఖ్య అనుచితమైనది, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అది ముఖ్యమంత్రితో సహా ప్రజలలో తీవ్ర ఆవేదనను కలిగించింది. ఆ వ్యాఖ్యపై స్పందించడం, లేదా ఈ విషయాన్ని రాజకీయం చేయడం వల్ల ఒడిశాలో బిజూ బాబుకు ఉన్న గౌరవం తగ్గిపోతుంది. ఈ విషయంపై తదుపరి చర్చలకు దూరంగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని న్యాయశాఖ మంత్రి పథ్వీరాజ్ హరిచందన్ అన్నారు.


