సమాజంలో మహిళలకు .. సముచితస్థానం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

సమాజంలో మహిళలకు .. సముచితస్థానం ఇవ్వాలి

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్‌

చైర్‌పర్సన్‌ సోహానా మహంతి

పర్లాకిమిడి: సమాజంలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలని, నారీమణులు నాలుగు గోడల మధ్య ఉండకుండా తమ హక్కులను కాపాడుకోవాలని రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ సోహానా మహంతి అన్నారు. పర్లాకిమిడిలో బ్లాక్‌స్థాయి న్యాయ చట్టాలపై అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక కలెక్టరేట్‌ వద్ద గ్రామీణ మహిళా స్వయం ఉపాధి శిక్షణా కేంద్ర హాల్‌లో మంగళవారం మహిళా చట్టాలు, వాటి అమలుపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఏడీ ఎం.ఫల్గునీ మఝి, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారిని మనోరమా దేవి, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ సరలా పాత్రో, జ్యువెనెల్‌ బోర్డు ప్యానల్‌ మహిళా న్యాయవాది భాగ్యలక్ష్మీ నాయక్‌, జిల్లా జీవనోపాధులశాఖ అధికారి శివాణీ పాణిగ్రాహి, సి.డబ్ల్యూ.సీ మాజీ చైర్మన్‌ ప్రమోద్‌ రవుళో, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. నారీమణులు సమాజంలో గౌరవం పొందాలంటే వంటింటి నుంచి బయటకురావాలన్నారు. మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న కార్యాలయాల్లో లైంగిక వేధింపులు, ఉద్యోగం ఇస్తామని మోసం చేసిన వారిపై న్యాయపరంగా పోరాడాలన్నారు. బాల్య వివాహాలు అరికట్టాలని, గృహాహింసపై అనేక చట్టాలు మహిళా హక్కులను కాపాడుతున్నాయని, వాటి గురించి తెలుసుకోవాలన్నారు. కొందరు మహిళా సర్పంచ్‌లు, బ్లాక్‌ చైర్‌ పర్సన్లు, ప్రజాప్రతినిధులు తమ పదవులను, అధికారాలను భర్తలకు తాకట్టుపెట్టే తత్వాన్ని వదులుకోవాలన్నారు. అప్పుడే ఒడిశా రాష్ట్రంలో మహిళలు సమానమైన హక్కులు పొంది ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందన్నారు. సమాజంలో ఉత్తమ సేవలు అందించిన ఆశ వర్కర్లు, ప్రజాప్రతినిధులకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలతో మహిళా చైర్‌పర్సన్‌ సత్కరించారు. కొంతమంది మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, భర్తలు, అత్తమామాల నుంచి వేధింపుల కేసులను విన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement