రాయగడ: వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి బారినపడి ప్రజలు అల్లాడిపోకుండా జిల్లాలోని బిసంకటక్ సమితి కార్యాలయం నీటి ఎద్దడి నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. సమితిలో మొదటి విడతగా పది నీటి ట్యాంకర్లను సిద్ధం చేసింది. ఈ మేరకు సోమవారం వాటికి పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. సమితి పరిధిలో గల చంచాడిగుడ, హటొమునిగుడ, పాయికొడాకులుగుడ, సహడ, జిగిడి, డుకుం. డుమురినెలి, భాత్‌పూర్, కుంభారిధాముని, కుట్రాగుడ పంచాయతీలకు ఈ ట్యాంకర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాల్లో తాగునీటి వనరులు ఉన్నప్పటికీ వేసవి తీవ్రత కారణంగా గొట్టపుబావులు మోరాయిస్తాయని, దీంతో ఆయా ప్రాంత ప్రజలు తాగునీటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆయా పంచాయతీలకు ఒకొక్కటి చొప్పున ట్యాంకర్‌లను సిద్ధం చేశారు. ఆయా గ్రామ పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి వంటి సమస్యలకు సంబంధించి అందిన ఫిర్యాదులకు స్పందించి వెంటనే ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేశామని తహసీల్దార్ కె.వెంకటరెడ్డి, బీడీఓ శివప్రసాద్ పట్నాయక్, సమితి వైస్ చైర్మన్ దేవీ ప్రసాద్ పట్నాయక్, ఆయా పంచాయితీల సర్పంచులు తెలియజేశారు.
వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ హడ్డుభంగి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు, యాత్ర సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు కోదండ రామాలయాన్ని సందర్శించారు. కాశీనగర్ సమితి మాజీ చైర్మన్ ఛిత్రి సింహాద్రి, జిల్లా ఉపాధ్యక్షుడు కోరేటి బాబూరావు, కాశీనగర్ జోన్–2 మండల అధ్యక్షుడు కె.జీవన్ రావు, సి.హెచ్.లోకనాథం, ఇతర బీజేపీ సీనియర్ నాయకులు, క్యాడర్ పాల్గొన్నారు. కోడూరునారాయణ రావుకు హడ్డుభంగి కోదండ సీతారామస్వామి మందిర కమిటీ అధ్యక్షుడు కోరేటి బూబూరావు స్వాగతం పలికి సన్మానించారు.
పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి
మల్కన్‌గిరి: పిల్లల ఆరోగ్యం పట్ల అంగన్‌వాడీలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని అధికారులు అన్నారు. మల్కన్‌గిరి జిల్లా పోడియ సమితి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పోషణ 15 యోజన కింద ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రూప్ డెవలప్‌మెంట్ అధికారి అశ్వినీ మహపాత్రో అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి పరిధిలోని వివిధ ప్రాంతాం నుంచి వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ.. పిల్లల ఎదుగుదల, మానసిక అభివృద్ధి నిర్ధాంచడం, పోషణ ట్రాకర్ యూప్‌లో పిల్లల వివరాలను ఆప్‌లోడ్ చేయాలని అంగన్‌వాడీలకు సూచించారు.
గ్రామ కంఠం భూమి ఆక్రమణ
రణస్థలం: లావేరు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 242లో ఉన్న ప్రభుత్వ భూమి (గ్రామకంఠం)ని ఒక టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణపై గ్రామ పెద్దలు ఎన్నిసార్లు వారించినా వినకుండా తనపని చేసుకుంటున్నాడు. సదరు టీడీపీ నాయకుడు గతంలో ఈ స్థలం ఆక్రమణకు విశ్వ ప్రయత్నాలు చేసినా గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆక్రమణ పర్వానికి తెరలేపాడు. తన ఇంటికి ఆనుకుని 40 అడుగుల పొడవునా, 4 అడుగుల వెడల్పున ఆక్రమించేలా పక్కాగా కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నాడు. దీనిపై కొంతమంది కలెక్టర్ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందినా మండల, గ్రామస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని ఆక్రమణలు అడ్డుకోవాలని కోరుతున్నారు.


