చైత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

చైత్రోత్సవాలు

Mar 30 2026 7:27 AM | Updated on Mar 30 2026 7:27 AM

వైభవంగా మజ్జిగౌరి అమ్మవారి

రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు సందర్భంగా అమ్మవారు సునా భెషోలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ముందుగా స్థానిక ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచిన అమ్మవారి బంగారు ఆభరణాలు శనివారం మందిర కమిటీ సభ్యులు తీసుకువచ్చారు. ట్రెజరీ వద్ద మందిరం ప్రధాన అర్చకులు చంద్ర శేఖర్‌ బెరుకొ ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం జిల్లా ట్రెజరీ అధికారి అనుమతితో లాకర్‌లొ ఉంచిన బంగారు ఆభరణాలను తీసుకువచ్చారు. పోలీసుల పూర్తి బందోబస్తుతొ మందిరానికి చెందిన ప్రత్యేక బస్సులో ఆభరణాలను తీసుకువచ్చి మందిరంలో నిలిపారు. శనివారం అర్ధరాత్రి అమ్మవారికి ముస్తాబు చేశారు. అమ్మవారి బంగారు ఆభరణాల అలంకరణతో పాటు అజ్ఞాత దాతలు సమర్పించిన 35 కిలొల వెండితో రూపొందించిన మకర తోరణాన్ని కూడా అమ్మవారి గర్భగుడిలో అలంకరించారు. ఆదివారం తెల్లవారు 4 గంటలకు మంగళహారతులు ఇచ్చాక అమ్మవారి మందిరం తలుపులు తెరిచారు. దీంతో అమ్మవారు సునా భెషోలో భక్తులు దర్శనం ఇచ్చారు. బంగారు ఆభరణాలతో పాటు ఎర్రని సింధూరంతొ అమ్మవారి ముఖం ప్రత్యేకంగా కనిపించడంతొ ఈ సుందర దృశ్యం వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు.

జంఝావతి నది వద్ద పూజలు

అమ్మవారి ఉత్సవాలకు ముందు మందిరం కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం సమీపంలో గల జంఝావతి నది వద్ద గంజాం జిల్లా నుంచి వచ్చిన పురొహితుల మంత్రోచ్ఛరణలతో గంగమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం నది నుంచి శుద్ధ జలాలను తీసుకువచ్చి అమ్మవారి మందిరంలో శుద్ధి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు నది వద్దకు ఎంతో మంది వెళ్లి పూజా కార్యక్రమాలను తిలకించారు. ఆదివారం నాడు ఉదయం మందిరం మేనేజింగ్‌ ట్రష్టీ రాయిసింగి బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, పెద్దీన వాసు, వడ్డాది శ్రీనివాస్‌ దంపతులు సూర్యావాహన పూజలు చేశారు. ఈ ఐదు రోజులు ఈ పూజల్లో కూర్చున్న దంపతులు నియమ నిష్టలతో పాటు ఉపవాస దీక్షలను చేసి అమ్మవారికి పూజలను నిర్వహిస్తారు. ప్రతి రొజు షొడొపొచార పూజలతో ప్రారంభమై చండీపఠనం, పూర్ణాహుతి వరకు ఈ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement