జయపురం: జయపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హౌసింగ్ మరియు అర్బన్ డవలప్‌మెంట్ వారి శ్రమ యోగీ మానధన్ పథకంలో భాగంగా సంచార సహాయక రథాన్ని మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి శుక్రవారం ప్రారంభించారు. స్థానిక బాబా సాహెబ్ కల్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రథం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు తెలియజేయడంతో పాటు వారికి అవసరమైన సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బి.సునీత, మున్సిపల్ అదనపు కార్య నిర్వాహక అధికారి పూజా రౌత్, జయపురం లేబర్ అధికారి చైతన్య మఝి, కౌన్సిలర్లు జైపాల్ సింగ్, గోపీనాథ్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ
కొరాపుట్: ప్రతిపక్ష బీజేడీకి చెందిన నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారిని మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి భువనేశ్వర్‌లో శుక్రవారం పరామర్శించారు. గత కొంతకాలంగా రంధారి చక్కెర వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ప్రమాదం వలన దెబ్బతిన్న పాదానికి ఇన్‌స్పెక్షన్ సోకింది. దీంతో కళింగ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేసుకున్నారు. గత 20 రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారని తెలుసుకొని కలిశారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
కొరాపుట్: కారు అదుపుతప్పి చెట్టుని ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం వేకువజామున కొరాపుట్ జిల్లా నందపూర్ నుంచి పాడువా వైపు వెళ్తున్న కారు నందపూర్ సమీపంలో మామిడి చెట్టుని ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులైన లబఖోర (35), అనంత పంగి (40)లను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
రైలు పట్టాలపై వృద్ధుడి మృతి
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ పోలీస్‌స్టేషన్ పరిధి జిరిడి పంచాయతీ నిగుండి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రత్నాలు (70) ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బుధవారం ఎటో వెళ్లిపోయాడు. కుటుంబీకులు అతని ఆచూకీ కోసం వెతికారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గురువారం రాయగడ రైల్వే పోలీసులు బిసంకటకట్ రైలు పట్టాలపై గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం బిసంకటక్ పోలీసులకు సమాచారం అందించారు. మృతుని జేబులో ఉన్న ఫొటో ద్వారా కుటుంబీకులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న కుటుంబీకులు మృతదేహాం లక్ష్మణ్‌దేనని నిర్దారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబీకులకు అప్పగించారు.
పిడుగుపాటుకు పశువులు మృతి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి రెంగ పంచాయతీ సెమిలిగుడ గ్రామంలో గురువారం పిడుగుపాటుకు నాలుగు పశువులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన బత్ర మాఝి, కుముద్‌మాఝి, లింగన్న మాఝి, మాలకీ మాఝిలకు చెందిన పశువులు ఎప్పటిలాగే ఇంటి బయట పనస చెట్టు కింద కట్టి ఉన్నాయి. సాయంత్రం వర్షంతో కూడిన పిడుగులు పడడంతో పశువులు మృతి చెందాయి. తమకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితులు కోరారు.


