● ప్రగతి మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో ప్రపంచ పఖాల్ దివస్
పర్లాకిమిడి: పఖాలన్నం శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా ఒడిశావాసుల సంప్రదాయ ఆహారమని జిల్లా మైనింగ్ అధికారి దిపెన్‌పరిడా అన్నారు. శుక్రవారం రాజవారి ప్యాలస్‌లో యుటెక్ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో ప్రపంచ పఖాల్ దినోత్సవాన్ని నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా దిపెన్‌పరిడా ప్రారంభించారు. క్యార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్‌చార్జి రాజేష్ కుమార్ మిశ్రా, ముఖ్యవక్తగా బినోదినీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్‌కుమార్ పట్నాయక్, విశ్రాంత ఉద్యోగి రామచంద్ర పాఢి, ప్రగతి మహిళా సంఘటన్ అధ్యక్షులు లోకనాథ మిశ్ర, సుభ్రత్ మహారాణా, ఉపాధ్యక్షులు బిచిత్రానంద బెబర్తా పాల్గొన్నారు. పూరీలో శ్రీజగన్నాథునికి శుక్రవారం ప్రసాద సేవనంలో పకాలన్నం, తోటకూర, ఘంటకూర నైవేద్యంగా అందిస్తారని, ఒడిశా సంప్రదాయ వంటకం పకాలన్నం అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా అన్నారు.
విజేతలు వీరే..
ఈ సందర్భంగా మహిళలకు పకాలన్నం, బెసరా, వక్తృత్వ పోటీలను ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శతపథి నిర్వహించారు. ప్రథమ బహుమతి విజయలక్ష్మీ పట్నాయక్, ద్వితీయ బహుమతి లల్లి ఖడగరాయ్, తృతీయ బహుమతి జోరణా పట్నాయక్, బబితా పండాలు గెలుచుకున్నారు. అలాగే కంజి వంటకం పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు బిజయలక్ష్మీ పట్నాయక్, ఝోరణా పట్నాయక్, ప్రమితా పట్నాయక్ లు గెలుచుకున్నారు. బెసర వంటకం తయారీ పోటీ లో ప్రథమ బహుమతి బిజయలక్ష్మీ పట్నాయక్, ద్వితీయ స్థానంలో బబితా పండా, తృతీయ స్థానంలో లిప్సితా పాఢిలు నిలిచారు. వీరికి ముఖ్యఅతిథి దిపెన్‌పాఢి చేతులమీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం అతిథులకు, విజేతలకు చద్దన్నం, తోటకూర, ఇతర వంటకాలు అందజేశారు.


