అరసవల్లిలో పంచాంగం ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

అరసవల్లిలో పంచాంగం ఆవిష్కరణ

Mar 11 2026 7:23 AM | Updated on Mar 11 2026 7:23 AM

శ్రీకాకుళం కల్చరల్‌: అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో పరాభవ నామ సంవత్సర (2026–27) నూతన పంచాంగాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌, ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.

పోలాకి పీహెచ్‌సీలో వివాదం

పోలాకి: పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీహెచ్‌ఈఓగా పనిచేస్తున్న నల్లి రవికుమార్‌, ఏఎన్‌ఎం కమల మధ్య వివాదం ముదిరి భౌతికదాడుల వరకూ వచ్చింది. రవికుమార్‌ పీహెచ్‌సీలో విధుల్లో ఉండగా తన భార్య పట్ల అసభ్యకరంగా మాట్లాడటానికి నీవెవరివి అంటూ ఏఎన్‌ఎం భర్త కరిమి శ్రీను మంగళవారం ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరికీ వివాదం జరిగింది. మాటామాటా పెరిగి ఆవేశంగా ఉన్న శ్రీను తన అనుచరులతో రవికుమార్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రవికుమార్‌కు గాయాలయ్యాయి. రవికుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీను తదితరులపై కేసు నమోదు చేశారు. ఇదే ఘటనపై ఏఎన్‌ఎం కమల కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్సై రంజిత్‌ తెలిపారు.

పాముకాటుతో వివాహిత మృతి

నరసన్నపేట: పెద్ద బొరిగివలసకు చెందిన ఇప్పిలి నీలవేణి(29) పాముకాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది. మంగళవారం సాయంత్రం పశువులకు గడ్డి కోసేందుకు కలివరపుపేట షిర్డీ సాయి ఆలయం వైపు వెళ్లగా నాగుపాము కాటు వేసింది. అనంతరం స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీలవేణి మృతి పట్ల వైఎస్సార్‌ సీపీ నాయకులు రాజాపు అప్పన్న, బగ్గు రమణయ్యలు సంతాపం వ్యక్తం చేశారు.

పెయింటింగ్‌ పోటీల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

కంచిలి: కంచిలిలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయస్థాయి పెయింటింగ్‌ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబర్చారు. డ్రీమ్‌ యంగ్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ ఆర్ట్‌ అకాడమీ ఫైన్‌ ఆర్ట్స్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌, విజయవాడ వారి 13వ ఆల్‌ ఇండియా యూత్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ ఆర్ట్‌ కాంపిటీషన్‌ కం ఎగ్జిబిషన్‌ ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఇందులో 25 మంది విద్యార్థులు స్వర్ణ పతకాలు, సర్టిఫికెట్లు, ఇద్దరు విద్యార్థులకు వెండి పతకాలు, 35 మంది విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్లు లభించాయి. చిత్రలేఖనంలో తర్ఫీదునిచ్చిన ఆర్ట్స్‌ ఉపాధ్యాయుడు దిక్కల మన్మథరావుకు అవార్డు లభించింది. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్‌ ఎన్‌.వి.రమణయ్య, ఉపాధ్యాయులు అభినందించారు.

గొట్టా యాఫ్రాన్‌కు ఆధునిక రూపం

హిరమండలం: గొట్టా బ్యారేజీకి సంబంధించి యాఫ్రాన్‌ను మెట్ల రూపంలో నిర్మించేందుకు జల వనరుల శాఖకు సంబంధించి సీఈసీడీఓ అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం గొట్టా బ్యారేజీతో పాటు వంశధార ఎత్తిపోతల పథకం, వంశధార ఫేజ్‌–2 రిజర్వాయర్‌ నిర్మాణ పనులు పరిశీలించారు. కుడి ప్రధాన కాలువ పరిస్థితిని సైతం ఆరాతీశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గొట్టా బ్యారే జీ ఆధునికీకరణ పనులకుగాను రూ.16 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. అందులో భాగంగా జలవనరుల శాఖకు సంబంధించి సీఈసీడీఓ బృందం పరిశీలించింది. సమగ్ర నివేదికను తయారుచేసే పనిలో పడింది. ప్రధానంగా గొట్టా బ్యారేజీకి సంబంధించి యాఫ్రాన్‌, చెదిరిపోయిన రాతి కట్టడాలను పరిశీలించారు. రాష్ట్రంలో మిగతా ప్రాజె క్టులకు సంబంధించి మెట్ల రూపంలో నిర్మాణానికి ఉన్న అవకాశాలపై స్థానిక అధికారులతో చర్చించారు. వంశధార ఫేజ్‌–2 రిజర్వాయర్‌తో ముడిపడిన అన్ని నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వంశధార ఎస్‌ఈ రామచంద్రరావు వారికి వివరించారు. సీఈసీడీఓ బృందంలో విజయభాస్కర్‌, శివకుమార్‌, కేదారేశ్వర్‌రెడ్డి, రేనా, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. వారి వెంట ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌ స్వర్ణకుమార్‌, ఈఈలు రవీంద్ర, మురళీ మోహన్‌, డీఈఈలు సరస్వతి, నాగేశ్వరరావు, రామకృష్ణ, అనిల్‌, సాయిరాం, కిశోర్‌, ఏఈలు ధనుంజయ, పరిశుద్ధబాబు, ఆనందరావు, సోమే శ్వరరావు, దిలీప్‌, అనిల్‌కుమార్‌, రంజిత్‌, రాఘవేంద్ర, సోమ కాంట్రాక్ట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement