16 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరు అరెస్టు
రాయగడ: కొరాపుట్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల్లో సేకరించిన గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాయగడ అబ్కారీ శాఖ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరెస్టయిన వారిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పహల్వాన్, కేబత, అనితాబాయ్ లొధిలుగా గుర్తించారు. జిల్లా అబ్కారీ శాఖ అధికారి సంతోష్‌కుమార్ ధలసామంతరాయ్ తెలియజేసిన వివరాల ప్రకారం.. పొరుగు జిల్లా కొరాపుట్ నుంచి గంజాయిని తీసుకువచ్చి మధ్యప్రదేశ్ కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటుచేసి దాడులు నిర్వహించామన్నారు. ఈ క్రమంలొ స్థానిక రైల్వే చెక్‌గేట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పట్టుకుని వారి బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి పట్టుబడినట్టు పేర్కొన్నారు. అరెస్టయిన నిందితుల్లొ ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు.
సైకత స్వాగతం
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చతుర్థామ క్షేత్రాల్లో ఒకటైన పూరీ శ్రీ జగన్నాథుని దర్శనం, స్థానిక శ్వేత గంగ ఒడ్డున పితృదేవతలకు పిండప్రదానం చేసేందుకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత ఐకత యానిమేటర్ మానస్ సాహు 2 గంటలపాటు నిర్విరామంగా శ్రమించి భారత రాష్ట్రపతి పూరీ సందర్శన ఇతివృత్తంతో సైకత యానిమేషన్ చిత్రీకరించారు. ఈ చిత్రీకరణలో ఒడిశాలోని పూరీకి స్వాగతం అనే సందేశాన్ని జోడించి కళాత్మకంగా స్వాగతించారు.
జాజ్‌పూర్‌లో పాఠశాలలకు సెలవు
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాజ్‌పూర్ విరజా పీఠం సందర్శించి పూజాదుల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈ నెల 3న మంగళవారం నాడు జాజ్‌పూర్ పట్టణంలోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నామని జిల్లా విద్యా అధికారి (డీఈఓ) ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ ప్రాంతం, పట్టణ పరిసరాల్లో అన్ని పాఠశాలలు మూసివేస్తారని మండల విద్యాధికారి (బీఈఓ) సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకుని జాజ్‌పూర్ పట్టణ ప్రాంతంలో సమగ్రంగా 47 ప్రభుత్వ, ఇతర పాఠశాలలు మూతబడతాయి.
16 కిలోల గంజాయి స్వాధీనం


