సిబ్బంది అప్రమత్తతే భద్రతకు కవచం
నలుగురు సిబ్బందికి ప్రత్యేక సత్కారం
భువనేశ్వర్: రెప్పపాటు ప్రమాదాల్ని నివారించడంలో సిబ్బంది అప్రమత్తత భద్రతకు కవచంలా కాపాడుతుందని తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ తెలిపారు. విధి నిర్వహణలో సిబ్బంది ఆదర్శవంతమైన అప్రమత్తత, అంకితభావం, సమయ స్ఫూర్తి చర్యకు నలుగురు రైల్వే ఉద్యోగులను సత్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. సత్కారం పొందిన ఉద్యోగుల్లో కొల్లి జగన్ మోహనరావు, ట్రాక్ మెయింటెయినర్–4, పార్వతీపురం, కింజరపు రమణ మూర్తి, టెక్నీషియన్–1, సీ అండ్ డబ్ల్యూ, విజయనగరం, మహ్మద్ జాఫర్, లోకో పైలట్ (గూడ్స్), టిట్లాగఢ్, ఆనంద్ ప్రకాష్ పాఠక్, సీనియర్ గూడ్స్ రైలు మేనేజర్, సంబల్‌పూర్ ఉన్నారు. విధుల నిర్వహణలో ఈ నలుగురు చురుకై న ప్రతిస్పందన క్లిష్టమైన లోపాలను గుర్తించి సంభావ్య పెను ప్రమాదాలను నివారించి భారతీయ రైల్వేల అధిక భద్రతా ప్రమాణాలకు పట్టం గట్టిందని అభినందించారు. గత ఏడాది డిసెంబర్ 15న ఆర్‌వీ–278 నంబర్ లెవెల్ క్రాసింగు గేటు వద్ద గేట్‌మ్యాన్‌గా విధుల్లో ఉన్న కొల్లి జగన్ మోహనరావు అర్ధరాత్రి వేళల్లో 18448 నంబర్ రైలు చక్రాల నుండి భారీ పొగ కమ్ముతున్నట్లు గుర్తించి ప్రమాద సంకేతాన్ని ప్రదర్శించి అనుబంధ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీని వల్ల లోకోమోటివ్‌లో యాక్సిల్ స్తంభించినట్లు గుర్తించి సంభావ్య ప్రమాదాన్ని నివారించారు. డిసెంబర్ 5న కింజరాపు రమణ మూర్తి విజయనగరంలో సరుకుతో నిండిన గూడ్స్ రైలు వ్యాగన్ యాక్సిల్ బాక్స్ నుండి అసాధారణ శబ్దాలను పసిగట్టారు. తక్షణమే ఈ పరిస్థితిని రైలు నిర్వహణ యంత్రాంగానికి తెలియజేయడంతో అప్రమత్తమై అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతతో రోలర్ బేరింగ్ లోపం గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టి పెను ముప్పు నివారించారు. డిసెంబర్ 18న గూడ్స్ రైలును నడుపుతున్న మహమ్మద్ జాఫర్ పరుగులు తీస్త్తున్న మరొక రైలు యాక్సిల్ బాక్స్ నుండి పొగ వెలువడుతున్నట్లు గమనించి వెంటనే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. దీని వల్ల ప్రభావితమైన రైలును సకాలంలో నియంత్రించి తీవ్రమైన రోలింగ్ స్టాక్ వైఫల్యాన్ని నివారించారు. డిసెంబర్ 22న సంబల్‌పూర్‌లో, ఆనంద్ ప్రకాష్ పాఠక్ కంటిన్యుటీ టెస్టింగ్ సమయంలో గూడ్స్ రైలు యొక్క బ్రేక్ వ్యాగన్‌లో విరిగిన సెంటర్ పివోట్ పిట్‌ను గమనించి లోపభూయిష్ట బ్రేక్ వ్యాగన్‌ను సురక్షితంగా తొలగించి భద్రతా చర్యలు చేపట్టడం ఘోర ప్రమాదాన్ని తొలగించింది. ఉద్యోగులను సత్కరిస్తూ జనరల్ మేనేజర్, పట్టాలు, సిగ్నల్, ఓహెచ్‌ఈ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, గూడ్స్ ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మేనేజర్లతో సహా ముందంజ సిబ్బంది రైల్వే కార్యకలాపాలకు భద్రత వ్యవస్థలో వెన్నెముక అని వారి నిరంతర అప్రమత్తత భద్రత మరియు సామర్థ్యం ప్రామాణికంగా పేర్కొన్నారు.


