ప్రభుత్వ వైఫల్యాలపై యువ బీజేడీ ఆందోళన
కొరాపుట్: ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష బిజూ జనతాదళ్ యువ, విద్యార్థి విభాగాలు ఆందోళన చేశాయి. మంగళవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని బిజూ పట్నాయిక్ విగ్రహానికి కార్యకర్తలు పూలమాలలు వేసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముందు భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ఆ పార్టీ రాష్ట్ర యువ విభాగ అధ్యక్షుడు చిన్మయ్ సాహు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితం అని ప్రకటించి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి మౌనం వహించారన్నారు. సుభద్ర పేరుతో రు.50 వేస్తామని చెప్పి అది నెలకు రు.5వేలు గా మార్చారన్నారు. పెన్షన్ రు.5000 ఇస్తామని చెప్పి అది 80 ఏళ్ల వయసు దాటాలని నిబంధన పెట్టారని చిన్మయ్ పేర్కొన్నారు. ఇదే సమావేశంలో పాల్గోన్న ఆ పార్టీ రాష్ట్ర విద్యార్ధి విభాగ అధ్యక్షురాలు ఇప్సితా సహు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా దోచుకుంటుందన్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ పేరుతో కొత్త దోపిడీ చేస్తుందన్నారు. బీఎస్‌కై వై ఆరోగ్య బీమా లేక పోవడంతో పేద రోగులు చాలా బాధపడుతున్నారని తెలిపారు. అనంతరం కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై యువ బీజేడీ ఆందోళన


