అభిజిత్ మజుందార్ కన్నుమూత
భువనేశ్వర్: ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు అభిజిత్ మజుందార్ (54) కన్ను మూశారు. గత కొద్ది కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. స్థానిక ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన 700కి పైగా పాటలకు దర్శకత్వం వహించారు. 1991లో సంగీత రంగంలోకి అడుగిడారు. అభిజిత్ మజుందార్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్ తదితర ప్రముఖులు, సంగీత కళాకారులు, అభిమానులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృత దేహాన్ని తొలుత ఆయన స్వస్థలం కటక్ నగరానికి తరలించి అంతిమ దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు. అనంతరం పూరీ తరలించి స్వర్గ ద్వారంలో అంత్యక్రియలు నిర్వహించారు.
శ్రీరాముని ఉత్సవ మూర్తుల ఊరేగింపు
రాయగడ: స్థానిక న్యూకాలనీలోని కోదండరామ మందిరం 65వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు వల్లభాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, విశేష పూజలు జరిగాయి. అనంతరం పురవీధుల్లో స్వామి వారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఆలయ మేనేజింగ్ ట్రస్టీ గుడ్ల గౌరీ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి.
హత్యకేసులో యావజ్జీవ కారాగార శిక్ష
రాయగడ: హత్యకేసుకు సంబంధించి బిసంకటక్ ఎస్‌డీజేఎం కోర్టు జిల్లా అదనపు మేజిస్ట్రేట్ విచారించి నిందితునికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చారు. జరీమానా చెల్లించలేని లేనిపక్షంలో అదనంగా మరో ఏడాది పాటు శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. వివరాల్లొకి వెళితే.. జిల్లాలోని బిసంకటక్ సమితి చాటికొన మలివీధిలో 2024 అక్టోబర్ ఒకటో తేదీన పాతకక్షలతో లకీరామ్ అనే వ్యక్తి ఘాసీరాం జిలకరను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు నిందితుడు లకీరామ్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. శనివారం ఈ కేసుకు సంబంధించి బిసంకటక్ ఎస్‌డీజేఎం కోర్టు అదనపు జడ్డి సాక్షులను విచారించిన పిదప ఈ మేరకు నిందితునికి శిక్షను ఖరారు చేశారు.
ఒడిశా సమగ్ర అభివృద్ధికి సహకరిస్తాం: సుమన్ కుమార్ బేరి
భువనేశ్వర్: నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ కుమార్ బేరి స్థానిక లోక్ సేవా భవన్‌లో ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, అభివృద్ధి కమిషనర్, అదనపు ప్రధాన కార్యదర్శి దేవ్ రంజన్ కుమార్ సింగ్, వివిధ విభాగాల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వివిధ అంశాలపై చర్చించారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ అరవింద్ వీరమణి, ఇతర అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ఒడిశా ఆర్థిక, సమగ్ర అభివృద్ధి, పారిశ్రామిక, పెట్టుబడుల ఉన్నతి, సులభతర వ్యాపార విధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్మాణాత్మక పురోగతి, విద్యుత్, పట్టణాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, విద్య, గిరిజన సంక్షేమం, సామాజిక రంగం మొదలైన వివిధ అంశాలపై చర్చించారు. వికసిత ఒడిశా–2036 మరియు వికసిత భారత్–2047 దార్శనికతతో, ఒడిశా విజన్ అమలుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఒడిశా అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. వివిధ రంగాలలో అభివృద్ధికి రాష్ట్రానికి పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
అభిజిత్ మజుందార్ కన్నుమూత
అభిజిత్ మజుందార్ కన్నుమూత


