శతాధిక వృద్ధురాలు మృతి
పొందూరు: మండలంలోని రెడ్డిపేట (పుల్లాజీపేట) గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు చిట్టూరు సావిత్రమ్మ మంగళవారం ఉదయం మృతి చెందింది. ఆమెకు భర్త సత్యం ఆచారి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమారైలు ఉన్నారు. ఈమె మృతిపై గ్రామస్తులు సంతాపం తెలిపారు.
ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు సత్యవరం విద్యార్థిని
నరసన్నపేట: మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఒడ్డు ఇందుమతి ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు ఎంపికై ంది. దివ్యాంగురాలైన ఇందుమతి గత నెల 28, 29 వ తేదీల్లో జరిగిన దివ్యాంగుల పరుగు పందెంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం పొందింది. దీంతో ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు ఇందుమతిని ఎంపిక చేశారని ప్రధాన ఉపాధ్యాయురాలు వకులా రత్నమాల, పీడీ జ్యోతిరాణి తెలిపారు. రాష్ట్రంలో 8 మంది దివ్యాంగ విద్యార్థినులు ఎంపిక కాగా సత్యవరం నుంచి ఇందుమతి ఒకరని తెలిపారు. జనవరి 22 నుంచి కడప జిల్లా గండికోటలో ఐదు రోజులు శిక్షణకు వెళ్తున్నట్లు తెలిపారు. దివ్యాంగురాలైన ఇందుమతి ఎవరె స్ట్‌ఎక్కేందుకు అవకాశంరావడం స్కూల్ ఖ్యాతి ఇనుమడింపజేసినట్లు అవుతుందన్నారు.
సేవల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజలకు అందించే సేవల్లో వేగం పెంచాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్, వన్–బీ వంటి సేవల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగకూడదని పేర్కొన్నారు. రెవెన్యూ క్లినిక్‌ల నిర్వహణ, భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతోందన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలని, సకాలంలో చెల్లింపులు జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ‘వాట్సాప్ మిత్ర’ ద్వారా అందుతున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేంది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యూరియా కోసం
రైతుల పడిగాపులు
గార: యూరియా కష్టాలు ఇంకా రైతులకు వెంటాడుతున్నాయి. మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద మంగళవారం యూరియా పంపిణీ ఉంటుందని వ్యవసాయ సిబ్బంది సమాచారమిచ్చారు. ఇప్పటికీ యూరియా డిమాండ్ అధికంగా ఉండటం, ప్రైవేటు డీలర్లు వద్ద యూరియా బస్తాతో పాటు గుళికలు, సిటీ కంపోస్టు, నానో యూరియా, జింక్ అంటూ లింక్ పెట్టి అధిక ధరలకు అమ్ముతుండటంతో రైతులు ప్రభుత్వం అమ్మకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే రైతులు పాసుపుస్తకాలు పట్టుకొని ఆర్‌ఎస్‌కే వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు వచ్చిన వ్యవసాయ సిబ్బంది రైతులు ఎక్కువ మంది ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. రైతులను అదుపు చేసిన పోలీసులు యూరియా పంపిణీ ప్రారంభించారు. ఉదయం ఏడు గంటలకు వచ్చి రెండు గంటల వరకు ఉంటే కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారని రైతులు వజ్జ రాము, బడగల తవిటినాయుడు, రాయవలస గవరరాజు, పండి రామారావు వాపోతున్నారు.
17 ఎకరాల్లో తోటలు దగ్ధం
కొత్తూరు: మండలంలోని కడుము గ్రామ సమీపంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కడుము గ్రామ సమీపంలో ధర్మావరం భూపతి లక్ష్మీనారాయణతో పాటు ఎనిమిది మంది రైతులకు సంబంధించిన నీలగిరి, జీడి, పామాయిల్ తోటలకు నిప్పంటుకుంది. సుమారు 17 ఎకరాల తోటలు కాలిపోయినట్లు రైతులు చెబుతున్నారు. అయితే రైతులు అందించిన సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం రాలేదని రైతులు వాపోతున్నారు. అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అగ్నికి ఆహుతవుతున్న తోటలు
శతాధిక వృద్ధురాలు మృతి
శతాధిక వృద్ధురాలు మృతి
శతాధిక వృద్ధురాలు మృతి


