పశువుల అక్రమ రవాణా అడ్డగింత
ఇచ్ఛాపురం/ఇచ్ఛాపురం రూరల్: ఒడిశా నుంచి పశువుల అక్రమ రవాణా జరగకుండా అడ్డుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్ర – ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పితాతోళి గ్రామం సమీపం నుంచి ఆవులను అక్రమంగా మూడు చిన్న వాహనాల్లో ఆంధ్ర మీదుగా తరలిస్తున్నారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన పితాతోళి ప్రాంతానికి చెందిన వసంతి అనే మహిళ పురుషోత్తపురం ఎల్‌సీ గేట్ వద్ద వాహనాలను అడ్డుకునేందుకు యత్నించింది. అయితే రెండు వాహనాలు ఆమె పైకి దూసుకు రావడంతో మహిళ తప్పించుకుంది. తర్వాత మరో వాహనాన్ని స్థానికుల సాయంతో అడ్డుకోగా.. వాహనాన్ని నడిపే డ్రైవర్ అక్కడే వాహనాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అనంతరం పురుషోత్తపురం గ్రామస్తుల సాయంతో వాహనాన్ని రూరల్ పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లి అప్పగించారు. వాహనాన్ని పరిశీలించగా అందులో 18 పశువులను గుర్తించారు. మూగ జీవాలను తాళ్లతో మెడకు బిగించి చిన్న వాహనంలో పెట్టడంతో సొమ్మసిల్లిపోయాయి. దీంతో వీటికి స్థానిక పశువైద్య సిబ్బందితో వైద్యం అందించారు. ఈ క్రమంలో ఒక ఆవు మృతి చెందింది. మిగిలిన 17 మూగజీవాలను ఒడిశాలోని దిగపోహండి గ్రామంలోపి గోశాలకు తరలించారు. కాగా ఇటువంటి అక్రమ రవాణా జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


