సంస్థలు ఏర్పాటు చేయాలి: గవర్నర్
భువనేశ్వర్: నైపుణ్యం ఉద్యోగాలకు పరిమితం కాకూడదని, వ్యవస్థాపకతపై దృష్టి సారించాలని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకతతో దగ్గరి సంబంధం కలిగి ఉండాలని వక్కాణించారు. లోక్ భవన్ అభిషేక్ హాల్‌లో ముఖ్యమంత్రి నైపుణ్యాభివృద్ధి ఫెలోషిప్ కార్యక్రమంలో పాల్గొన్న వారితో గవర్నర్ ముఖాముఖి సంభాషించారు. ఒక నిర్దిష్ట రంగంలో వ్యక్తులు శిక్షణ పొందిన వారు ఉపాధికి మాత్రమే పరిమితం కాకుండా వ్యవస్థాపక అవకాశాలను అన్వేషించడానికి వీలు కల్పించే నైపుణ్యాలకు పదును పెట్టాలన్నారు. ఈ నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణార్థులు వినూత్నంగా ఆలోచించి సంస్థల ఏర్పాటుకు ప్రేరణ, ప్రోత్సాహం అవసరం అన్నారు. శిక్షణలో పాల్గొన్న వారు తమ రంగాలలో అందుబాటులో ఉన్న అవకాశాల గురించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేయగలగాలి అని డాక్టర్ కంభంపాటి తెలిపారు. వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలతో సంస్థలను స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఉత్సాహంతో ముందుకు రావాలని గవర్నర్ కోరారు. వ్యవస్థాపకులు తమ ప్రాజెక్టులకు బ్యాంకు రుణాలతో సహా సంస్థాగత ఆర్థిక సహాయం పొందడంలో మార్గనిర్దేశం చేయాలని గవర్నర్ అన్నారు. శిక్షణ సమయంలో ప్రతిభావంతులైన వ్యక్తుల విజయ స్ఫూర్తి, మార్గదర్శకత్వం, దిశానిర్దేశం పట్ల అవగాహన కల్పించాలన్నారు. పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై వంటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సామాజిక సంక్షేమ పథకాల జ్ఞాన సముపార్జనతో ప్రజలు వాటి ప్రయోజనాలను పొందడంలో సహాయపడి సామాజిక అభివద్ధికి దోహదపడాలని గవర్నర్ కార్యక్రమంలో పాల్గొన్న వారిని కోరారు. ముఖాముఖి సంభాషణ సందర్భంగా డాక్టర్ కంభంపాటి శిక్షణ శైలి, లబ్ధిదారుల అంచనాలు, పరిశ్రమలతో సంబంధాలు, శిక్షణ పూర్తయిన తర్వాత అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల గురించి ఆరా తీశారు. శిక్షణ, నైపుణ్య అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి నైపుణ్య అభివృద్ధి ఫెలోషిప్ కార్యక్రమం కింద వారి ప్రయత్నాలలో విజయం సాధించాలని గవర్నర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
సంస్థలు ఏర్పాటు చేయాలి: గవర్నర్


