సత్వర న్యాయమే యూటీఆర్‌సీ లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల కేసులను సత్వరమే పరిష్కరించి, అర్హులైన వారికి న్యాయం చేయడమే యూటీఆర్‌సీ లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో పోలీసు, రెవెన్యూ, న్యాయాధికారులతో కలిసి అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. కోర్టుల ద్వారా బెయిల్ మంజూరైనప్పటికీ, పూచీకత్తులు సమర్పించలేక లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల జైలులోనే ఉండిపోయిన ముద్దాయిల వివరాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు, మహిళలు, దీర్ఘకాలంగా జైలులో మగ్గుతున్న అండర్ ట్రయల్ ముద్దాయిలకు ప్రాధాన్యతనిస్తూ, వారిని త్వరితగతిన బెయిల్‌పై విడుదల చేసేందుకు ఈ యూటీఆర్‌సీ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసు అధికారులు, ప్రాసిక్యూషన్ విభాగం, న్యాయవాదులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో క్రైమ్ రేటును తగ్గించడంపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కేవీ రమణ, డీఆర్వో ఎం.లావణ్య, ఒకటో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, మూడో అదనపు జిల్లా జడ్జి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, నాల్గో అదనపు జిల్లా జడ్జి ఎస్.ఎం.ఫణి కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


