విక్రయానికి రథయాత్ర చక్రాలు
భువనేశ్వర్: పూరీ జగన్నాథ యాత్ర రథాల విడి భాగాలు విక్రయించాలని శ్రీ మందిరం అధికార వర్గం (ఎస్‌జేటీఏ) నిర్ణయించింది. జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర వార్షిక రథయాత్రలో ఉపయోగించిన మూడు పవిత్ర రథాల చక్రాలను ఈ సంవత్సరం విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి నిర్ధారిత కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) జారీ చేసింది. దీని ప్రకారం రథ చక్రాలతో పాటు, ప్రభ, గుజ, అసువారీ వంటి ఇతర విడి భాగాలు భక్తులకు అమ్మకానికి అందుబాటులో ఉంటాయని ఎస్‌జేటీఏ పేర్కొంది. ఆసక్తిగల దరఖాస్తుదారులు ఈ నెల 10లోపు దరఖాస్తులను దాఖలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు రూ.1,000 తిరిగి చెల్లించని రుసుము చెల్లించడం తప్పనిసరి.
ఎస్‌ఓపీ ప్రకారం జగన్నాథుని రథంలోని ఒక్కో చక్రం ధర రూ.3 లక్షలుగా నిర్ణయించగా బలభద్రుని రథ చక్రం ధర రూ. 2 లక్షలు, దేవి సుభద్ర చక్రం ధర రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తు ఫారాలు పూరీలోని ఎస్‌జేటీఏ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. చెక్క రథాల నిర్మాణాల పవిత్రతను కాపాడి మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యతతో నిండిన జగన్నాథ వారసత్వంలో కొంత భాగాన్ని కలిగి ఉండే అరుదైన అవకాశాన్ని భక్తులకు అందించడం ఈ చొరవ ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం రథ యాత్ర కోసం కొత్త రథాలను నిర్మిస్తారు. యాత్ర తర్వాత చెక్క భాగాలను కూల్చి వేస్తారు. ఈ ఏడాది ఆ పవిత్ర అవశేషాలను విక్రయించేందుకు అధికారిక, పారదర్శక విధానం ఎస్‌ఓపీ రూపొందించడం విశేషం.
విక్రయానికి రథయాత్ర చక్రాలు
విక్రయానికి రథయాత్ర చక్రాలు
విక్రయానికి రథయాత్ర చక్రాలు


