అధికారులు సమన్వయంతో పనిచేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహేంద్రతనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి మెళియాపుట్టి, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం తదితర మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పురోగతిపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన దిశానిర్దేశం చేశారు. భూ సేకరణ ఇతర పనులకు సంబంధించిన పాత పెండింగ్ బిల్లులు దాదాపు రూ.16.20 కోట్లు తక్షణమే విడుదల చేయడానికి ప్రతిపాదనలు పంపాలని వంశధార భూసేకరణ విభాగాన్ని ఆదేశించారు. ప్యాకేజీలు, డబుల్ స్టోర్డ్ భవనాలు, డబుల్ చెల్లింపులు వంటి సమస్యలపై ఆర్డీవో, టెక్కలి, సంబంధిత తహసీల్దార్లు పూర్తిస్థాయి నివేదికలను త్వరగా సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.వెంకటేష్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, ప్రత్యేక ఉప కలెక్టర్ జయ దేవి, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


