బీజేపీలో చేరిన బీజేడీ అగ్రనేత అమర్ పట్నాయక్
భువనేశ్వర్: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిజూ జనతా దళ్ (బీజేడీ) సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు అమర్ పట్నాయక్ సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఇది విపక్ష బిజూ జనతా దళ్‌కు గట్టి ఎదురు దెబ్బగా రాజకీయ శిబిరాల్లో చర్చ జోరందుకుంది. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి విజయ్ పాల్ సింగ్ తోమర్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో పట్నాయక్‌ను పార్టీలోకి స్వాగతించారు. భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందు బిజూ జనతా దళ్ (బీజేడీ)లో ప్రముఖ వ్యక్తిగా అమర్ పట్నాయక్ వెలుగొందారు. పార్టీ సాంకేతిక సమాచార విభాగం ప్రముఖునిగా చివరి క్షణం వరకు వ్యవహరించారు. ఆయన పార్టీ ఫిరాయించడం రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఈ పరిణామంతో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన ఉనికిని బలోపేతం చేసుకునే ప్రయత్నాలలో పట్నాయక్ కీలక పాత్ర పోషిస్తారని సర్వత్రా ఆశాభావం వ్యక్తం అవుతుంది. బీజేపీలో చేరిన తర్వాత అమర్ పట్నాయక్ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దార్శనికత ద్వారా తాను ప్రేరణ పొందానని అన్నారు. అభివృద్ధి చెందిన భారత దేశం కోసం పార్లమెంటులో ప్రధాన మంత్రి ప్రసంగం తరచూ హృదయాన్ని హత్తుకునేది. భారత దేశాన్ని ముందంజ వేయించడంలో ప్రధాన మంత్రి నిబద్ధత తనకు స్ఫూర్తినిస్తుందన్నారు. నేడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కారణంగా దేశం ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని అమర్ పట్నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లో చేరి ఇప్పటి వరకు రాష్ట్రానికి సేవ చేసిన తనకు దేశ నిర్మాణంలో తన ఉనికిని నిర్ధారించే దిశలో పని చేసేందుకు తన తాజా నిర్ణయం దోహదపడుతుందన్నారు. పార్టీ ఏ బాధ్యత కట్టబెట్టిన సమర్థంగా నిర్వహిస్తానన్నారు. 2018లో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ బిజూ జనతా దళ్ అధికారంలో ఉన్నప్పుడు అమర్ పట్నాయక్ ఆ పార్టీలో చేరారు. తదనంతరం ఆయన రాజ్యసభ సభ్యునిగా, బిజూ జనతా దళ్ సాంకేతిక సమాచార విభాగం చైర్‌పర్సన్‌గా పని చేశారు. ఆయన బీజేడీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు.


