ఈ ప్రభుత్వం గేమ్ చేంజర్ కాదు, నేమ్ చేంజర్
నువాపడా ఉప ఎన్నిక ప్రచారంలో నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: నువాపడా ఉప ఎన్నిక ప్రచారంలో ప్రతిపక్ష నాయకుడు, బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ పాల్గొన్నారు. ఆయన శస్త్ర చికిత్స తర్వాత బహిరంగ సభా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదే తొలి సారి. నువాపడా నియోజక వర్గం తొరొబొడా ప్రాంతం ధనొమండి గ్రౌండ్‌లో జరిగిన భారీ ఎన్నికల ప్రచార సభలో నువాపడా ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి స్నేహంగిని చురియా తరఫున ప్రచారం చేస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ఢొలొకియాకు నివాళులర్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఓట్లను దొంగిలించి ఇప్పుడు అభ్యర్థులను దొంగిలిస్తోందని సూటిగా ఆరోపించారు. నువాపడా జిల్లాను సృష్టించడంలో బిజూ పట్నాయక్ పాత్రను గుర్తు చేశారు. బిజూ జనతా దళ్ ప్రభుత్వ హయాంలో నువాపడా వేగవంతమైన అభివృద్ధిని చవి చూసింది. బిజూ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి సురక్షిత తాగునీరు, 10,000 హెక్టార్లకు పైబడిన పొట పొలాలకు నీటిపారుదల, సునాబెడ అభయారణ్యం నివాసితులకు వివిధ సంక్షేమ పథకాలు వంటి పలు పథకాలు ఈ జిల్లాకు పుష్కలంగా కేటాయించినట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అంతటా అభివృద్ధి స్తంభించిపోయిందని విచారం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కుప్పకూలాయి, మహిళలపై దారుణాలు తార స్థాయికి చేరుకున్నాయి. మిషన్ శక్తి మహిళలకు గత 8 నెలలుగా జీతాలు అందడం లేదు. రైతులకు యూరియా కొరత, వయో వృద్ధులకు ఫించను అందడం లేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కేవలం స్వీయ ప్రయోజనాల కోసం తలునకలైపోయిందన్నారు. ఇది నినాదాల ప్రభుత్వం. ప్రచారంలో హీరో, కార్యాచరణలో జీరో (సున్నా) అని చమత్కరించారు. గేమ్ చేంజర్ ప్రభుత్వం కాదు నేమ్ చేంజర్ ప్రభుత్వంగా వ్యాఖ్యనించారు.
ఈ ప్రభుత్వం గేమ్ చేంజర్ కాదు, నేమ్ చేంజర్


