ఆడాళ్లూ మీకు జోహార్లు
భువనేశ్వర్: భారత మహిళా క్రికెట్ జట్టు క్రికెట్ ప్రపంచ కప్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిందని సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. సమగ్ర ప్రపంచానికి భారత దేశ నారీ శక్తి శక్తిని చవి చూపారని కొనియాడారు. 2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో వారి ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేశారు. చారిత్రాత్మక విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనగా పూరీ సాగర తీరంలో క్రికెటు బ్యాట్, అనేక బంతులతో కూడిన సువిశాల సైకత శిల్పాన్ని ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.
ఇద్దరు భక్తులకు అస్వస్థత
రాయగడ: స్థానిక జగన్నాథ మందిరం ఆదివారం సాయంత్రం భక్తులతో కిటకిటలాడింది. అయితే భక్తుల రద్దీలో ఇద్దరు మహిళలు ఊపిరి తీసుకోలేక అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన ఇద్దరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వడంతో ఇంటికి తరలించారు. అయితే స్థానిక ఉత్కలమణి నగర్‌కు చెందిన భవానీ సాహు అనే మహిళ తవ్ర అస్వస్థతకు గురవ్వడంతో చికిత్స అందజేస్తున్నారు. మందిరం కమిటీ సభ్యులు రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని భక్తులు అంటున్నారు.
చిలికాలో చిక్కుకున్న
పడవ
భువనేశ్వర్: యాంత్రిక లోపం కారణంగా చిలికా సరస్సులో ప్రయాణికుల పడవ చిక్కుకుంది. సోమవారం ఉదయం 7 గంటలకు సతొపొడా నుంచి జొహ్నికుదాకు పడవ బయల్దేరింది. దీనిలో 10 బైక్‌లతో సహా 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మొంహిషాకుదొ సమీపంలో యాంత్రిక లోపం కారణంగా పడవ గంటసేపు సరస్సు నడిబొడ్డున చిక్కుకుంది. నావికులు మరమ్మతులు చేసి యాత్రికులను సురక్షితంగా తీరం చేర్చారు.
రాయగడలో వినతుల స్వీకరణ
రాయగడ: స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన వినతుల స్వీకరణ కార్యక్రమం సోమవారం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన 66 సమస్యలు కలెక్టర్ దృష్టికి వచ్చాయి. వీటిలో 47 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించగా.. మిగతావి గ్రామ సమస్యలుగా గుర్తించారు. గ్రామ సమస్యలకు సంబంధించి వాటిని పరిశీలించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా పది మందికి వైద్య ఖర్చులకు సంబంధించి రెడ్‌క్రాస్ నుంచి ఆయన ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ బి.సరోజిని దేవి తదితరులు పాల్గొన్నారు.
ఆడాళ్లూ మీకు జోహార్లు
ఆడాళ్లూ మీకు జోహార్లు


