ఆన్‌లైన్‌లో పరిహారం చెల్లింపు
● రెవెన్యూ మంత్రి సురేష్ కుమార్ పూజారి ● 72 గంటల్లో నివేదికలు అందజేయాలి
భువనేశ్వర్: మోంథా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి జిల్లా మేజిస్ట్రేట్లను ఆదేశించారు. ఈ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం అవుతుందని విలేకర్ల సమావేశంలో తెలిపారు. దెబ్బతిన్న పంటలను అధికారులు అంచనా వేస్తారన్నారు. 72 గంటల్లో నివేదిక దాఖలు చేయాలని ఆదేశించారు. అవసరమైతే క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా ప్రక్రి య నిర్ధారిత గడువులోగా ముగించేందుకు ఇతర జిల్లాల నుంచి అదనంగా ఉద్యోగులను తీసుకువస్తామన్నారు. చాలాచోట్ల ఇళ్ల గోడలు కూలిపోయా యి. ఆయా ప్రభావితులకు పాలిథిన్ షీట్లు పంపిణీ చేశారు. ఇళ్లు దెబ్బతిన్నట్లయితే అంచనా తర్వాత పరిహారం చెల్లిస్తారు. అంచనా ప్రక్రియలో భాగంగా అధికారులు బాధితులు, పీడితులకు బ్యాంక్ ఖాతా, ఖాతా నంబర్ అడుగుతారని మంత్రి తెలిపారు. పరిహారం వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు వీలుగా ఈ వివరాలు అవసరమని తెలిపారు.
31 వరకు జాగ్రత్తగా ఉండాలి..
మంత్రి సురేష్ కుమార్ పూజారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. గురు వారం కొన్ని చోట్ల వర్షం పడుతోందన్నారు. గజపతి జిల్లా గొషాణి మండలంలో అత్యధికంగా 150 మిల్లీ మీటర్లు వర్షం కురిసిందన్నారు. మోంథా తుఫాను ప్రభావంతో 56 మండలాల్లో 50 నుంచి 100 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది. తుఫాను విపత్తు నిర్వహణ కోసం 161 బందాలను మోహరించారు. 19,000 మందిని 2164 తుఫాను ఆశ్రయాలకు తరలించారు. 2,189 మంది గర్భిణులను ఆస్పత్రు లకు తరలించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించారు.
రహదారులపై కూలిన చెట్లు తక్షణమే తొలగించి రహదారి రాకపోకలు పునరుద్ధరించారు. 33 మండలాలు, 11 పట్టణ ప్రాంతాలు మోంథా తుఫానుతో ప్రభావితమయ్యాయి. 362 ప్రదేశాలలో 18,762 మందికి వండిన ఆహారాన్ని అందిస్తున్నారు. వాతావరణ శాఖ ముందస్తు అంచనా ప్రకారం.. తుఫాను 29వ తేదీన బలహీనపడింది. తుఫాను దిశను మార్చుకుని ఒడిశా కోస్తా సరిహద్దు గుండా జార్ఖండ్‌కు చేరుకుందన్నారు.


