మోంథా తీవ్రతపై సీఎం సమీక్ష
భువనేశ్వర్: తీరం దాటిన మోంథా తుఫాన్ తీవ్రతని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సమీక్షించారు. ప్రత్యేక సహాయ కమిషనర్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి తుఫాను మోంథా దృశ్యాల్ని వీక్షించారు.
రాష్ట్రంపై మోంథా ప్రభావం లేదు
భువనేశ్వర్: రాష్ట్రంపై మోంథా తుఫాన్ ప్రభావం లేదని స్థానిక వాతావరణ శాఖ డైరెక్టర్ మనోరమ మహంతి తెలిపారు. ఒకటి రెండు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మల్కన్‌గిరి, కొరాపుట్ ప్రాంతాలలో గాలుల తీవ్రత తగ్గుముఖం పడుతుందన్నారు. కోస్తా, దక్షిణ ఒడిశాలోని కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. జంట నగరాలు కటక్, భువనేశ్వర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని పేర్కొన్నారు.
నువాపడ ఉప ఎన్నికల ప్రచారంలో కొండబాబు
రాయగడ: నువాపడ శాసనసభ స్థానానికి నవంబర్ 11వ తేదీన జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో రాయగడకు చెందిన బీజేపీ నాయకుడు యాల్ల కొండబాబు పాల్గొన్నారు. పార్టీ తరఫున పోటీ చేస్తున్న జై డొలకియా తరఫున ఆయన తన అనుచరులతో ప్రచారం కొనసాగిస్తున్నారు. బీజేపీ అధిష్టానం నువాపడ శాసనసభ పరిధిలోని రాజ్‌ఖరియార్ రోడ్డు ఎన్‌ఏసీ ప్రాంతానికి ఎన్నికల పరిశీలకునిగా కొండబాబును నియమించింది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఆయా ప్రాంతంల్లో విస్తతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఉప ఎన్నికలో బీజేడీ పార్టీ నుంచి స్నేహాంగిని ఛురియా, కాంగ్రెస్ నుంచి ఘాసీరాం మాఝి, సమాజ్‌వాది పార్టీ నుంచి రమాకాంత హటి, బహుజన్ ముక్తి పార్టీ నుంచి హేమంత్ తండి, ఒడిశా జనతా దల్ నుంచి సుకంధర్ దండశేణలు పోటీలో ఉన్నారు.
ట్రక్కును ఢీకొన్న బస్సు
భువనేశ్వర్: జలేశ్వర్ లక్ష్మనాథ్ టోల్‌గేట్ సమీపంలో 60వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున వరి ధాన్యాన్ని తీసుకెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. డ్రైవర్, సహాయకుడు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను కటక్ జిల్లా సాలేపూర్ ప్రాంతానికి చెందిన బస్సు డ్రైవర్ మీర్ అబ్దుల్ రహీమ్ (39), మహాంగాకు చెందిన సహాయకుడు నృసింఘ కటువా (40)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారందరినీ జలేశ్వర్ జీకే భట్ ఆస్పత్రిలో చేర్చారు. డాల్ఫిన్ అనే ప్రైవేటు బస్సు ఢెంకనాల్ జిల్లా నృసింఘపూర్ నుంచి కోల్‌కతాకు వెళుతుండగా వెనుక నుండి ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.
విద్యార్థులకు అతిసార
భువనేశ్వర్: కటక్ రెవెన్షా విశ్వవిద్యాలయం ఈస్ట్ హాస్టల్‌లో 15 మందికి పైగా విద్యార్థులు అతిసార బారిన పడ్డారు. వీరిని స్థానిక ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్చారు. కలుషిత ఆహారం, తాగునీటి వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
మోంథా తీవ్రతపై సీఎం సమీక్ష


