
స్వచ్ఛంద సేవకుడు షణ్ముఖ పాత్రో మృతి
కొరాపుట్: ప్రముఖ గోవిందాలయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు షణ్ముఖ పాత్రో (50) మృతి చెందారు. శుక్రవారం వేకువజామున న్యూఢిల్లీలోని తన నివాసంలో గుండె పోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించే సరికి తుది శ్వాస విడిచినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని నబరంగ్‌పూర్ జిల్లాకి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నబరంగ్‌పూర్ జిల్లా నందాహండి సమితి సొరుగుడ గ్రామానికి చెందిన షణ్ముఖ ప్రాతో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. నబరంగ్‌పూర్ జిల్లాలో ప్రజల కోసం గోవిందాలయ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా అంబులైన్స్ సేవలు, గిరిజన విద్యార్థులకు ఉపాధి రంగాలలో శిక్షణ అందిస్తున్నారు. కాగా షణ్ముఖ సూచించిన విధంగా తన మరణాంతరం అంత్యక్రియలు సొరుగుడలోని గోవిందాలయ ప్రాంగణంలో జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈయన మృతి పట్ల రాష్ట్ర ప్రాధమిక విద్య, సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గొండో, నబరంగ్‌పూర్ ఎంపీ బలబద్ర మజ్జి, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జిలు వేర్వేరు ప్రకటనలలో సంతాపం ప్రకటించారు. శనివారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని గోవిందాలయ వర్గాలు ప్రకటించాయి.