
చోరీ కేసులో ముగ్గురు నిందితులకు రెండేళ్ల జైలు
రాయగడ: చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ రోడ్డు సమీపంలోని మందుల షాపులో రూ.15 వేల నగదు, మొబైల్ ఫోన్ చోరీ చేసి అరెస్టయిన ముగ్గురు నిందితులకు సంబంధించి ఎస్‌డీజేఎం వర్షా దాస్ శుక్రవారం విచారించి రెండేళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. 2024 అక్టోబరు 17వ తేదీ రాత్రి బిసిస రోడ్డు వద్ద గల బాలాజీ మెడికల్ స్టోర్‌లో చోరీ జరిగింది. దీనికి సంబంధించి బాధితుడు చందిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు హేమంత్ కుమార్ రావు, ఎస్‌కే భాషా, బి.వెంకటేష్‌లను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కేసు విచారణ చేపట్టిన ఎస్‌డిజేఎం వర్షాదాస్ 9 మంది సాక్షులను విచారించి అనంతరం తీర్పునిచ్చారు. అదేవిధంగా పదేసి వేలు జరిమానా కింద చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. చెల్లించకుంటే అదనంగా మరో 6 నెలల పాటు జైలు శిక్షను అనుభవించాలని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుడిపై దాడి
● ఇద్దరు వ్యక్తులు అరెస్టు
రాయగడ: రాష్ట్రపతి అవార్డు గ్రహీత, బిలేసు ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ద్వితిచంద్ర సాహుపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను భువనేశ్వర్ కమిషనరేట్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో భువనేశ్వర్ బుద్ధనగర్ ప్రాంతానికి చెందిన అర్జున్ ప్రధాన్, పీడబ్ల్యూడీ బస్తీ పరిధి కొదలి గోదాం ప్రాంతంలో నివసిస్తున్న సునీల్ నాయక్‌లుగా గుర్తించారు. నిందితుల నుంచి పోలీసులు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. గత సోమవారం ఉపాధ్యాయుడు భువనేశ్వర్‌లో జరిగే ఒక సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ రైల్వేస్టేషన్ 6వ నంబర్ ప్లాట్‌ఫారంలో దిగి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతనిపై దుండగులు దాడిచేసి సెల్‌ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఘటనలో ఉపాధ్యాయుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ఆయన లక్ష్మీసాగర్ పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.