
ఆస్పత్రి సిబ్బంది దురుసు ప్రవర్తన
రాయగడ: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రోగిని తీసుకొచ్చిన ఆశా కార్యకర్తపై హస్పిటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించాని ఆశా కార్యకర్త అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని కాసీపూర్ సమితి డంగలొడి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త పుష్పాంజలి బెవుర ఈనెల 10వ తేదీన అదే గ్రామంలో నివాసముంటున్న రవీంద్ర నాగవంశి భార్య లఖాబతితో పాటు ఆమె నాలుగు నెలల బిడ్డను చికిత్స కోసం స్థానిక జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రాథమిక వైద్యమందించిన వైద్యులు రక్త పరీక్షలను చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త నమూనాలను ల్యాబ్‌లో సిబ్బందికి ఇచ్చారు. వాస్తవానికి అదేరోజు రక్త పరీక్షలకు సంబంధించి రిపోర్టును ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ల్యాబ్ సిబ్బంది మరుసటి రోజు రమ్మని పంపించారు. వారు చెప్పినవిధంగా మరుసటి రోజు యథావిధిగా రిపోర్టు కోసం ఆస్పత్రికి వచ్చారు. అయితే ల్యాబ్‌లో కొన్ని రిపోర్టులు గల్లంతయ్యాయని చెప్పి తిరిగి పంపించారు. దీంతో రిపోర్టు విషయంపై ల్యాబ్ సిబ్బందిని ఆశా కార్యకర్త ప్రశ్నించగా, సరైన బదులు చెప్పలేదు సరికదా.. దురుసుగా ప్రవర్తించారని వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆస్పత్రి ముఖ్యవైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రోను వివరణ కోరగా ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని, అందుకు సంబంధించి దర్యాప్తు చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ఆస్పత్రి సిబ్బంది దురుసు ప్రవర్తన