
దుర్గాపూజలో అపశృతి..
● కటక్‌లో భారీ వర్షం ● పందిరి కూలి ముగ్గురికి గాయాలు
భువనేశ్వర్: దుర్గాపూజలకు ప్రసిద్ధి చెందిన కటక్‌నగరంలో భారీ వర్షాలు దసరా ఉత్సవాలను దెబ్బతీశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు చోట్ల ప్రమాదాలు జరిగాయి. కాలేజ్ స్క్వేర్, రాజా బగిచా ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదం సమయంలో కాలేజ్ స్క్వేర్ ప్రాంతంలో ఎవరూ గాయపడలేదు. రాజా బగిచాలో పూజలు జరుగుతుండగా ప్రమాదం సంబంవించింది. పూజా మండపం పైకప్పు కూలడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని వైద్య కేంద్రంలో చేర్చారు. భారీ వర్షం కారణంగా కటక్ నగరంలో పలుచోట్ల విద్యుత్తు సరఫరా, తాగునీటి పంపిణీకి అంతరాయం ఏర్పడింది.