
పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ
జయపురం: పంచాయతీరాజ్ శాఖ మంత్రి రబినారాయణ నాయిక్ ఆదివారం సాయంత్రం జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరుగురు లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, ఎనిమిది మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు కార్డులు అందజేశారు. దివ్యాంగ మహిళకు స్టీల్ చైర్ అందించగా.. 27 స్వయం సహాయక గ్రూపు మహిళలకు రూ. 39 లక్షలు రుణం పంపిణీ చేశారు. అనంతరం సమితి కార్యాలయ సభాగృహంలో సమితి స్థాయి అధికారులతో సమితిలో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వర్ధన్, బొరిగుమ్మ సీడీవో వేణుధర శబర, బీడీవో సుకాంత కుమార్ పట్నాయక్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి స్థానిక డాక్ బంగ్లాలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. బొరిగుమ్మ సమితిలో పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృత నిశ్చయంతో పని చేయాలన్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రితోపాటు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ శాశ్వత సభ్యులు గౌతమ సామంతరాయ్, మండలి అధ్యక్షులు బిఘ్నేశ్వర షొడంగి, సావణ మహంతి, భాస్కర భట్, గోవింద భట్, చక్రధర గదబ పాల్గొన్నారు.