నేడు శ్రీక్షేత్రంలో చిత్తాలగ్గి సేవ | - | Sakshi
Sakshi News home page

నేడు శ్రీక్షేత్రంలో చిత్తాలగ్గి సేవ

Jul 24 2025 8:39 AM | Updated on Jul 24 2025 8:39 AM

నేడు

నేడు శ్రీక్షేత్రంలో చిత్తాలగ్గి సేవ

● మూలవిరాటులకు నుదుట ఆభరణం అలంకరణ ● సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత

భువనేశ్వర్‌:

శ్రావణ కృష్ణ పక్ష అమావాస్య తిథి పురస్కరించుకుని గురువారం శ్రీ మందిరంలో చిత్తా లగ్గి సేవ నిర్వహిస్తున్నారు. జగన్నాథుని సంస్కృతిలో ఈ తిథి చిత్తా లగ్గి అమావాస్యగా ప్రతీతి. ప్రధానంగా రైతు కుటుంబాలు ప్రత్యేక పబ్బంగా జరుపుకుంటారు. శ్రీ క్షేత్రంలో శ్రీమందిరం రత్న వేదికపై దేవతా త్రయం జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర నుదుట వజ్ర, రత్న, వైడూర్య కచిత ప్రత్యేక ఆభరణాలతో శోభిల్లుతారు. బయట సాధారణ ప్రజలు ప్రత్యేక వంటకాలతో భగవంతునికి నివేదించి ఆరాధిస్తారు. కొన్ని వర్గాలు చిత్తా లగ్గి అమావాస్యని లలాట అమావాస్యగా వ్యవహరిస్తారు. ఈ తిథి పురస్కరించుకుని రత్న వేదికపై మూల విరాటులకు లలాటంపై ప్రత్యేక ఆభరణం బాసికం తొడుగడంతో దీనిని లలాట అమావాస్యగా పేర్కొంటారు. శ్రీ మందిరంలో జగన్నాథుని రోజువారీ ఉదయం పూట ధూపదీపాదుల పూజలు ముగియడంతో లలాట ఆభరణ అలంకరణ ప్రారంభిస్తారు. ఆలయ ఆచారం ప్రకారం పతి మహాపాత్రో సేవాయత్‌ వర్గం మూల విరాటుల నదుటి ఆభరణం శుద్ధి చేసిన తర్వాత దైతపతి వర్గం ఒక్కో మూల విరాటు నుదుట ఆభరణాన్ని అలంకరిస్తారు. ఇదంతా పూర్తయ్యాక జగతి నాథునికి మహా స్నానం చేయించి సర్వ దర్శనానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో సమగ్ర ప్రక్రియ పూర్తయ్యే వరకు శ్రీ మందిరంలో సాధారణ భక్తులకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేస్తారు. భక్తులకు ఏడాది పొడవునా స్నాన పూర్ణిమ వరకు స్వామి లలాటం వజ్ర కాంతులతో దర్శనం లభిస్తుంది. జ్యేష్ట మాసం పూర్ణిమ పురస్కరించుకుని జగతి నాథుని మహా జలాభిషేకం పురస్కరించుకుని నుదుట ధగేలుమనే రత్న ఖచిత బాసిక ఆభరణం తొలగిస్తారు. రథయాత్ర పూర్తయిన తర్వాత ఏటా శ్రావణ కృష్ణ పక్ష అమావాస్య నాడు తిరిగి బాసికం ఆభరణాన్ని స్వామి నుదుట యథాతథంగా అలంకరిస్తారు. జగన్నాథుని లలాటంపై వజ్రం పొదిగిన తెల్లని బాసికం, బలభద్ర స్వామి నుదుట నీలి రంగు రత్నం పొదిగిన బాసికం, దేవీ సుభద్ర నుదుట ఎర్రని మాణిక్యం పొదిగిన బాసికం అలంకరిస్తారు. తదుపరి జ్యేష్ఠ పౌర్ణమి వరకు మూల విరాటుల నుదుట ఈ ఆభరణం నిత్య శోభాయమానంగా తళుక్కుమంటుంది.

రైతుల పండగ..

శ్రావణ మాసం అమావాస్య నాడు రైతాంగం ప్రత్యేక పూజాదులు నిర్వహిస్తారు. సాగు జలాశయాలు, చిత్తడి పంట పొలాల్లో కీటకాల బారి నుంచి రక్షణ పొందే సంకల్పంతో ప్రత్యేక ఆచారాలు వ్యవహరిస్తారు. ఈ తిథి పురస్కరించుకుని ప్రత్యేక పిండి వంటలు చిత్తౌ, గొంయిఠా తయారు చేసి చిత్తడి పంట పొలాలు, సాగు జలాశయాల్లో విడిచి పెడతారు. ఈ వంటల్ని కంద ఆకుల్లో చుట్టి భద్రంగా జలాశయాల్లో విడిచి పెడతారు. సాగు భూముల్లో నీటి కింద సంచరించే నత్తలు, జలగలు వంటి కీటకాల బారి నుంచి రక్షణ పొందేందుకు ఈ పిండి వంటలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సాగు పనుల సమయంలో ఈ కీటకాలు సాధారణంగా రైతుల కాళ్లను స్వల్పంగా గాయపరుస్తుంటాయి. ఈ ముప్పు నుంచి విముక్తి కోసం నత్తలు వంటి కీటకాల తాకిడి నివారణ ఉద్దేశంతో అమావాస్యని ప్రత్యేకంగా జరుపుకోవడంతో దీనిని గెండాకొట్టా ఒసాగా పేర్కొంటారు. బాలాసోర్‌, మయూర్‌భంజ్‌, కెంజొహర్‌ వంటి ప్రాంతాలలో, ఈ పబ్బం గెండాకొట్టా అమావాస్యగా జరుపుకుంటారు. సాగు భూముల్లో నత్తలు వంటి కీటకాల్ని శాంతింపజేయడానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో గిరిజనులు జరుపుకునే పండుగలలో ఇది ఒకటి కావడం విశేషం.నేడు సర్వ దర్శనం నిలిపివేత

లలాట అమావాస్య ప్రత్యేక పూజాదులు పురస్కరించుకుని శ్రీ మందిరం రత్న వేదికపై మూల విరాటుల దర్శనం గురువారం తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ఆలయ అధికార వర్గాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురు వారం తొలి భోగ మండప సేవ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సర్వ దర్శనం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.

నేడు శ్రీక్షేత్రంలో చిత్తాలగ్గి సేవ 1
1/2

నేడు శ్రీక్షేత్రంలో చిత్తాలగ్గి సేవ

నేడు శ్రీక్షేత్రంలో చిత్తాలగ్గి సేవ 2
2/2

నేడు శ్రీక్షేత్రంలో చిత్తాలగ్గి సేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement