భువనేశ్వర్: పూరీ గోవర్ధన పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి సీమాంతర యాత్ర సంప్రదాయబద్ధంగా జరిగింది. చాతుర్మాస వ్రతం ముగింపు పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. జగద్గురు శంకరాచార్యులు ఈ సందర్భంగా గోవర్ధన్ మఠం నుంచి బయటకు వచ్చి శ్రీ మందిరం సింహ ద్వారం ప్రాంగణంలో కొలువైన పతిత పావన స్వామిని తొలుత దర్శనం చేసుకున్నారు. తరువాత బట్టొ మంగళ, నీలాంబర్ పూర్ బిల్లొ మహాదేవుని దర్శించుకున్నారు. సాయంత్రం సాగర తీరాన సంధ్యా హారతి ముగించి తిరిగి గోవర్ధన మఠానికి చేరారు. జగద్గురు శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి చాతుర్మాస్య వ్రతం సందర్భంగా శ్రీ క్షేత్రం పొలిమేర దాటారు. ఈ వ్రతం పురస్కరించుకుని నాలుగు నెలలూ గోవర్ధన్ ఆశ్రమంలో ఉంటూ స్వామి శిష్యులు, భక్తులకు ధార్మిక విజ్ఞాన బోధ చేశారు. నా లుగు నెలలుగా నిర్వహించే చాతుర్మాస్య వ్రతాన్ని నియమ, సంప్రదాయాల ప్రకారం పూర్తి చేసుకున్న జగద్గురు శంకరాచార్యులు తన శిష్యులతో కలిసి ముందుగా ఆలయ సింహద్వారం నుంచి పతిత పా వన స్వామిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మందిరం ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఏఓ) రంజన్‌కుమార్ దాస్ తదితరులు శంకరాచార్యులకు స్వాగతం పలికి సంప్రదాయబద్ధంగా శ్రీ మందిరం సింహ ద్వారం ప్రాంగణానికి తీసుకుని వెళ్లారు. అనంతరం బట్టొ మంగళ ఆలయానికి వెళ్లి పుష్పాంజలి ఘటించారు. సాయంత్రం పూరీ సాగర తీరంలో ప్రార్థనలు చేసి లోక కల్యాణం కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జగద్గురువుల ఆశీస్సులు పొందారు. మఠం సరిహద్దు దాటి సరిహద్దు లంఘన యాత్ర ముగియడంతో జగద్గురు శంకరాచార్యులు ఇక నుంచి శ్రీ క్షేత్రం పొలి మేరలు దాటి బయట ప్రాంతాలు సందర్శిస్తారు.
పతితపావన స్వామిని దర్శించుకున్న
శంకరాచార్యులు


