
ఆరగించడానికి సిద్ధంగా ఉన్న మాంసాహార పొఖాలొ
సోమవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2023
పొఖాలొ..
● ఇంటింటా నోరూరిస్తున్న చద్దన్నం రుచులు ● ఆరోగ్యంతో పాటు ప్రీతికరమైన ఆహారంగా గుర్తింపు ● వేసవి ఆగమనంతో మరింత ప్రాధాన్యత ● నేడు పొఖాలొ దివాస్
భువనేశ్వర్: పెద్దల మాట చద్దన్నం మూట అనేది సామెత. ఆహారంలో చద్దన్నానికి ఇచ్చే ప్రాధన్యత అటువంటిది. వేసవి వస్తే పుల్లటి తరవాణీ(పులిసిన గంజి), మజ్జిగతో చద్దెన్నం ఆరగిస్తే ఆ సత్తయే వేరని భావించే వారు. పొఖాలొగా పిలిచే ఈ భోజనం రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రీతికరమైన ఆహారం. వేసవి ఆగమనంతో ఇంటింటా పొఖాలొ రుచులు నోరూరిస్తుంటాయి. పక్కా లోకల్ తినుభండారమైనా.. రాష్ట్ర పరిచయ ప్రతీకగా రాజ్యమేలుతున్న మాట నిజం. ఏటా మార్చి 20న పొఖాలొ దివాస్(పొఖాలొ దినం)గా జరుపుకోవడం విశేషం. ఈ వేడుకకు ఇంత వరకు ఎటువంటి గుర్తింపు లేకున్నా, రాష్ట్రంలో యువతరం నడుం బిగించి పొఖాలొ దిబొసొ ప్రాచుర్యానికి రెక్కలు తొడుగుతోంది. పేరొందిన హోటళ్లు ఇతరేతర స్వచ్ఛంద సంస్థలు పొఖాలొ దిబొసొ వేడుకలకు వేదికగా నిలుస్తున్నాయి.
బహుళ రుచులతో..
శాకాహారం, మాంసాహారం వంటకాలతో పొఖాలొ విందు జరుపుకోవడం పట్ల యువత ఉత్సాహం కనబరుస్తోంది. పెరుగు, మామిడి, అల్లం తురుము, కరివేపాకు రెబ్బలతో శాకాహార పొఖాలొ ఘుమఘుమలాడుతుంది. శాకాహార పొఖాలొ ఆరగించేందుకు ములక్కాడల వేపుడు, ఒడియాలు, కాకర–ఆలుగడ్డల చిప్స్, గుమ్మడి పువ్వుల వేపుడు, బంగాళదుంపల పిడుపు, తండూరి టమాటా చట్నీ, వంకాయ వేపుడు, ఆవ పిండికూర(బెసారొ), ఆవకాయ, అప్పడాలు నంజుగా వినియోగిస్తారు.
నిమ్మరసం, మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినట్లు జోడించి సుమారు గంటపాటు ఉంచి సుగంధ పొఖాలొ వడ్డిస్తారు. రొయ్యలను ఉడికించిన రెండో విడత నీటిలో మిరియాలు, ఉప్పు, వెనిగర్ మిశ్రమంతో తయారైన టబాస్కో సాస్, ఉప్పు, అల్లం, మిరియాలు కలిపి మాంసాహార పొఖాలో సిద్ధం చేస్తారు.
చమత్కార సామెతల ఆవిష్కర్త..
సమష్టి కుటుంబాలు పోయి వ్యష్టి కుటుంబాలు వచ్చాక ఆనాటి చద్దెన్నం సంస్కృతి క్రమంగా తెరమరుగు అవుతుందనుకుంటే పొరబడినట్లే. రిఫ్రిజిరేటర్ సంస్కృతి వచ్చాక ఇదే ఎక్కువైంది. కానీ ఆగరింపులోనే పాత సంస్కృతి పోయింది. రిఫ్రిజిరేటర్ సంస్కృతిలో రాత్రన్నం మిగిలిపోతే పులిహోర కలపడం ఆనవాయితీగా చలామణి అవుతోంది. సమష్టి కుటుంబాల్లో జనాభా ఎక్కువ. ఒక్కోసారి రాత్రి మిగిలిపోయిన అన్నంలో పాలు పోసి, ఉల్లిపాయలు కలిపి తోడుపెట్టే వారు. ఉదయానికి కమ్మగా తోడుకుని అద్భుతంగా ఉండేది. ఇది అరుదుగా వచ్చే అవకాశం. జనాభా కారణంగా నిత్యం ఇటువంటి చద్దన్నం సాధ్యమయ్యేది కాదు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచ బడుతుందనే సామెత అందుకే వచ్చిందేమో. ఇంటి పనుల్లో పడి వడ్డన ఆలస్యమైతే చద్ది కూడు ఆరగించిన కోడలుకి అత్త ఆకలి ఏం తెలుస్తుందనే సూదంటు చమత్కారం అప్పుడప్పుడు మార్మోగుతుండేది.
ఆరోగ్యదాయకం..
ముప్పొద్దులా తింటే పిల్లలు బలంగా ఉండి ఏపుగా ఎదుగుతారని పెద్దవాళ్లు నమ్మేవారు. ఇదే వైఖరిని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు బలపరుస్తున్నాయి. వైజ్ఞానిక ముద్ర పడడంతో నేటి తరంలో చద్దన్నం(పొఖాలో) తారాస్థాయిలో రంగప్రవేశం చేస్తోంది. పొఖాలొ దిబొస్ పురస్కరించుకుని గల్లీ నుంచి తారాస్థాయి హోటల్ సంస్థలు రుచికరమైన కూరలను జోడించి పొఖాలొ వడ్డించి సొమ్ము చేసుకుంటున్నారు. శాకాహార పొఖాలొ థాలీ(ప్లేట్) ధర రూ.99 నుంచి రూ.299 కాగా.. మాంసాహారం రూ.249 నుంచి రూ.399 వరకు పలుకుతోంది. పొఖాలొ దిబొసొ(చద్దన్నం దినం) ప్రాచుర్యంతో ఉదయం పూట టిఫిన్ బదులుగా అల్పాహార మెనూలో చద్దెన్నం చోటు చేసుకునే శుభ ఘడియలు దగ్గర పడుతున్నాయని నిర్వాహకుల వర్గం భావిస్తోంది. చద్దన్నం ప్రోబయాటిక్, ఐరన్ అండ్ కాల్షియం తదితర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బీ విటమిన్ దీనిలో పుష్కలంగా ఉంటుందని వైజ్ఞానిక వర్గాల సమాచారం.
56 భోగాల్లో ఒకటి..
సాక్షాత్తు జగన్నాథ స్వామికి నివేదించే 56రకాల భోగాల్లో(నైవేద్యాలు) పొఖాలొ కూడా చోటు చేసుకోవడం విశేషం. వేసవిలో ఉదయం స్వామి దర్శనం చేసుకుని వెనుదిరిగే ద్వారం ప్రాంగణంలో మట్టి పిడతల్లో తరవాణి భక్తులకు విక్రయిస్తారు. తరవాణిలో నిమ్మ, దబ్బ ఆకులను జోడించి ఘుమఘుమలాడించడం విశేషం.
వివాదంలో వీకే పాండ్యన్!
మహేంద్రగిరి అభివృద్ధిపై చర్చలు
న్యూస్‌రీల్

పొఖాలో ఆరగిస్తున్న సీఎం నవీన్ పట్నాయక్ (ఫైల్)

ర్యాలీ నిర్వహిస్తున్న మహిళా క్లబ్ సభ్యులు

గంజాయితో పోలీసుల అదుపులో నిందితుడు