విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లు జనసేనకు కేటాయించే అవకాశం పచ్చనేతల ఆశలు గల్లంతు సీఎం చంద్రబాబు, లోకేశ్ వ్యూహాత్మకంగానే సీటు వదిలేశారంటున్న తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం
పవన్ మాటలతో మంట..
కాక రేపుతున్న స్థానిక సంస్థల సీట్ల పంపకాలు
సాక్షి, విజయవాడ: మునిసిపల్ ఎన్నికల నగారా మోగకముందే కూటమిలో రాజకీయం అగ్గిరాజుకుంది. సోమవారం రిజర్వేషన్లు వెలువడిన వెంటనే కూటమిలో సీట్ల పంపకాల విషయంలో వార్ మొదలైంది. నిన్నటి వరకు మేయర్ స్థానాల కోసం భారీగానే ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన టీడీపీ నేతలు.. జనసేనకు ఇస్తున్నట్లు వార్తలు రావడంతో లోలోపల ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్థలతో పాటు తాడిగడప, పెడన, గుడివాడ, ఉయ్యూరు, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ మునిసిపాలిటీల్లో రిజర్వేషన్లు తారుమారు కావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. విజయవాడ మేయర్ పీఠం కోసం అటు కూటమి పార్టీలో, ఇటు వైఎస్సార్ సీపీలో తీవ్ర పోటీ కనిపిస్తోంది. అయితే విజయవాడ, మచిలీపట్నం జనసేన ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీడీపీ నేతల ఆశలపై నీళ్లు..
విజయవాడ నగర మేయర్ పీఠం తమకు అంటే తమకే కావాలని టీడీపీ నేతలు పోటాపోటీగా వ్యూహాలు పన్నుతూ వచ్చారు. అధిష్టానానికి సంకేతాలు పంపడంతో పాటు అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు ఇస్తున్నట్లు తెలుస్తుండటంతో.. ఇంతవరకు మేం చేసిందంతా ఇందుకా.. అని ఫైర్ అవుతున్నారట.
మచిలీపట్నం కథ మరోలా..
మచిలీపట్నం కార్పొరేషన్లో ఇటీవల ఇద్దరు జనసేన నేతలు మేయర్ పీఠం కోసం వీధికెక్కారు. మేయర్ సీటు తమది అంటే తమదే అంటూ ఇద్దరు నేతలు ప్రెస్మీట్లు పెట్టి మరీ సవాల్ విసురుకున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం కార్పొరేషన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ ఇద్దరికీ నిద్ర పట్టడం లేదట.
రిజర్వేషన్లు ఉల్టా కావడంతో..
ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఎస్సీ మహిళకు, జగ్గయ్యపేట జనరల్ మహిళ, తిరువూరు బీసీ జనరల్కు రిజర్వ్ కాగా.. నందిగామ మునిసిపాలిటీ మాత్రం అన్ రిజర్వ్డ్ అయింది. మచిలీపట్నం జిల్లా పరిధిలోని మచిలీపట్నం బీసీ మహిళ, పెడన జనరల్ మహిళ, గుడివాడ బీసీ మహిళ, ఉయ్యూరు ఎస్సీ జనరల్, తాడిగడప బీసీ జనరల్కు కేటాయించారు. దీంతో వీటిలో పాగా వేద్దామని నిన్నటి వరకు ఆశలు పెట్టుకున్న వారికి రిజర్వేషన్ దెబ్బకొట్టడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాకినాడలో జరిగిన ఓ సభలో ప్రసంగించిన మాటలు టీడీపీ, జనసేన మధ్య వివాదానికి దారి తీశాయి. సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులో సునాయాసంగా గెలిచి పోతామని భావిస్తున్న ఆశావహులు కాస్త.. వీరి గొడవలతో తామెక్కడ బలవుతామో అనే డైలమాలో పడుతున్నారు.


