అడ్డదారుల్లో దర్శనాలు | - | Sakshi
Sakshi News home page

అడ్డదారుల్లో దర్శనాలు

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

అడ్డదారుల్లో దర్శనాలు ● గేట్లకు తాళాలు వేసిన కమిషనర్‌ ● విధులకు అర్చకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల అగచాట్లు

● గేట్లకు తాళాలు వేసిన కమిషనర్‌ ● విధులకు అర్చకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల అగచాట్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలలో అడ్డదారుల్లో దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. వీఐపీ కార్లు, వృద్ధులు, వికలాంగులకు కేటాయించిన కార్లతో పాటు రూ.వెయ్యి జీరో టికెటు కలిగిన వారు తమ వారికి దర్జాగా అడ్డదారుల్లో దర్శనాలు చేయిస్తున్నారు. అధికార పార్టీ మంగళగిరి కార్యాలయానికి చెందిన కొంతమందికి ప్రత్యేకంగా దసరా విధులు వేశారు. వీరికి దేవస్థానం అధికారికంగా డ్యూటీ పాస్‌లు జారీ చేయడం గమనార్హం. కూటమి పార్టీకి చెందిన వారు ఆలయ సిబ్బందితో సమానంగా దర్శనాలు చేయించడం కనిపించింది. మరో వైపున ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన వారితో పాటు నగరంలోని పలు ఆలయాలు, సత్రాల బోర్డు డైరెక్టర్లు సైతం తమ వారికి రాజమార్గంలో దర్శనాలు చేయిస్తున్నారు. ఉత్సవాలలో మూడో రోజైన మంగళవారం ఈ పరిస్థితి మరింత శృతిమించింది. దీంతో ఆలయంలో ఉన్న దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ క్యూలైన్లు మినహా మిగిలిన గేట్లు అన్నింటికి తాళాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. గాలిగోపురం పక్కనే మెట్ల మార్గంతో పాటు మెట్ల పూజ మార్గానికి, స్కానింగ్‌ పాయింట్‌లో గేట్లకు ఆలయ సిబ్బంది గేట్లకు తాళాలు వేశారు. అప్పటికే కొండపైకి చేరుకున్న సిఫార్సులు, అనధికార వీఐపీలు గేట్ల వద్ద గుంపులు గుంపులుగా చేరిపోయారు. మధ్యాహ్నం డ్యూటీలు ముగించుకుని తిరిగి వెళ్లే అర్చకులతో పాటు ఆలయంలో విధులకు హాజరయ్యే అర్చకులు సైతం గేట్ల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపున ఆలయంలో సేవలు అందిస్తున్న ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు సైతం తాళాలు వేసి ఉన్న గేట్ల వద్ద గోడలు దూకి వెళ్లాల్సిన పరిస్థితి. మరో వైపున ప్రొటోకాల్‌ దర్శనాల నమయం కాకున్నా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన వారు ఆలయానికి చేరుకుని దర్శనాలు చేసుకోవడం కొసమెరుపు. దసరా ఉత్సవాలలో కీలకమైన మూలా నక్షత్రం, విజయ దశమి రోజున భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అనధికార దర్శనాలకు అడ్డకట్ట వేయకుంటే ఇబ్బందులు తప్పవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement