దుర్గమ్మకు శ్రీవారి సారె | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు శ్రీవారి సారె

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

దుర్గమ్మకు శ్రీవారి సారె కనుల పండువగా కృష్ణమ్మకు హారతులు రైళ్ల పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం హెలికాప్టర్‌ జాయ్‌ రైడ్స్‌ ప్రారంభం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం పక్షాన మంగళవారం సారె సమర్పించారు. శ్రీవారి క్షేత్రం నుంచి జగన్మాతకు సారె సమర్పించడం రెండు పుణ్యక్షేత్రాల మధ్య ఆధ్యాత్మిక అనుబంధాన్ని, భక్తి సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పేదిగా ఏళ్లుగా కొనసాగుతోంది. ద్వారకాతిరుమల దేవస్థానం చైర్మన్‌ సూరనేని వెంకట నివృతరావు, కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వారికి దుర్గగుడి చైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌ స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలతో పాటుగా ప్రత్యేక పూజా సామగ్రిని శిరస్సుపై ఉంచుకొని మేళతాళాలతో ఆలయంలోకి తీసుకెళ్లారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గాఘాట్‌ లో మంగళవారం సాయంత్రం కృష్ణమ్మకు నవ హారతుల సేవ జరిగింది. ప్రతి నిత్యం సాయం సంధ్య వేళ కృష్ణమ్మకు దుర్గగుడి అర్చకులు నవ హారతులను ఇస్తారు. సాధారణ రోజులలో భక్తులను హారతులను వీక్షించేందుకు అనుమతిస్తారు. దసరా ఉత్సవాలలో భక్తులకు అనుమతి ఉండదు. తాజాగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన నవ హారతులకు భక్తులను ఆలయ అధికారులు అనుమతించారు. తొలుత కృష్ణమ్మకు దుర్గగుడి అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన పసుపు, కుంకుమ, చీరను సమర్పించారు. అనంతరం అర్చకులు హారతులను ఇవ్వగా, సుమారు అరగంట పాటు సాగిన హారతులను భక్తులు ఆద్యంతం ఎంతో భక్తిశ్రద్ధలతో వీక్షించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చి మ): పరిశుభ్రత, ప్రయాణికుల మౌలిక సదుపాయాల మెరుగుదలలో ప్రజలను భాగస్వామ్యం చేసే దిశగా దక్షిణ కోస్తా రైల్వే, విజయవాడ డివిజన్‌లోని గుడివాడ రైల్వే స్టేషన్‌లో ‘రైల్‌ జన్‌ సంవాద్‌’ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు, డీఆర్‌యూసీసీ (డివిజనల్‌ రైల్‌ యూజర్స్‌ కన్సెల్టేటివ్‌ కమిటీ) సభ్యులు, క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి రైళ్లలో పరిశుభ్రతను మెరుగుపర్చాల్సిన అంశాలు, ప్రయాణికుల మెరుగైన సౌకర్యాలపై భాగస్వాముల నుంచి సీనియర్‌ డీఓఎం సురేష్‌రెడ్డి సూచనలు తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌లు, రైళ్లలో పరిశుభ్రతను పాటించడం, రైల్వే పరిసర ప్రాంతాలను కొనసాగించడంతో ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం ఆవశ్యకతను ఆయన వివరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై డీఆర్‌యూసీసీ సభ్యులు సురేష్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ ఉత్సవ్‌–2026లో భాగంగా పర్యాటక శాఖ, విహంగ్‌ అడ్వెంచర్స్‌ సంస్థ ఆధ్వర్యాన విద్యాధరపురం లేబర్‌కాలనీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌ జాయ్‌ రైడ్స్‌ను మంగళవారం వేగ జ్యూయలర్స్‌ అధినేత సుధాకర్‌ ప్రారంభించారు. విజయవాడ అందాలను గగనతలం నుంచి వీక్షించేలా ఏర్పాటు చేసిన ఈ హెలికాప్టర్‌ రైడ్స్‌ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. రోజుకు సుమారు 50 ట్రిప్పుల నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని విహంగ్‌ అడ్వెంచర్స్‌ నిర్వాహకుడు సూర్య వెంకట తేజ తెలిపారు. విహంగ వీక్షణం ద్వారా కృష్ణానది, ప్రకాశం బ్యారేజీ, ఇంద్రకీలాద్రి, శ్రీకనకదుర్గమ్మ ఆలయం, ఇందిరా గాంధీ మునిసిపల్‌ స్టేడియం పరిసరాలు తిలకించవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement