ముగిసిన వసంత నవరాత్రులు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన వసంత నవరాత్రులు

Mar 29 2026 6:50 AM | Updated on Mar 29 2026 6:50 AM

ముగిసిన వసంత నవరాత్రులు చెత్త రహితంగా తీర్చిదిద్దాలి నిత్యాన్నదానానికి విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించు కుని దేవస్థానం తరఫున అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు. గులాబీలు, చామంతులు, మల్లెలు, విరజాజులు, తామర పూలు, కాగడాలతో ఆలయ అర్చకులు అమ్మవారికి పుష్పార్చన జరిపించారు. ఆలయ ఈఓ శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణతో పాటు ట్రస్ట్‌ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మల్లేశ్వరస్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో మహా పూర్ణాహుతిని ఆలయ వైదిక కమిటీ నిర్వహించింది. స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చక బృందం పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపించారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలు తయారయ్యే ప్రదేశంలోనే వాటిని వేరు చేయడం ద్వారా గ్రామాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ సూచించారు. గొల్లపూడిలోని స్వర్ణ వార్డ్‌ వద్ద శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర –స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేయించారు. ఇంటి నుంచి తడి–పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడంలో కృషి చేసినవారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ లావణ్య కుమారి, మండల పరిషత్‌ అధికారి కె.పార్థసారథి, డెప్యూటీ ఎంపీడీఓ మన్నే దుర్గ వరప్రసాద్‌, గ్రామ పెద్దలు బొమ్మసాని సుబ్బారావు, నూతులపాటి వెంకటేశ్వరరావు, ఎన్‌.బాల కోటేశ్వరరావు, బి.తిరుపతిరావు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ లబ్బీపేటకు చెందిన దేవి నేని రామకృష్ణ, కనకదుర్గాంబ అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులకు నిత్యాన్నదానానికి రూ.1,11,116 విరాళం అందచేశారు. ఇబ్రహీంపట్నానికి చెందిన సముద్రాల వీరభద్రరావు, శ్రీలత అమ్మ వారి నిత్యాన్నదానానికి రూ.1,11,116 విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. అమ్మ వారి దర్శనం, వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement