కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): దేశంలో అత్యధిక పాల సేకరణ ధర, పాడి రైతులకు బోనస్ అందిస్తున్న ఘనత కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ)ది అని సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ 36వ సర్వ సభ్య సమావేశం శని వారం పాలప్రాజెక్టు ఆవరణలోని ఫంక్షన్ హాల్‌లో జరిగింది. యూనియన్ మాజీ చైర్మన్ మండవ జానకీ రామయ్య చిత్రపటానికి చైర్మన్, ఎండీ, సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ ఏడాది యూనియన్ బోర్డు, సంస్థ ఉద్యోగులు సంయుక్త కృషితో సాధించిన వివరాల గురించి చైర్మన్ సభ్యులకు వివరించారు. సమావేశం అనంతరం చైర్మన్ చలసాని ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. పాడి రైతులు ఆర్థికంగా నిలబడటమే కాకుండా వారికి తోడ్పాటును అందించాలనే కృత నిశ్చయంతో పాల సేకరణ ధరను రూ.30 పెంచి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆవుపాల ధరను లీటర్‌కు రూ.20 పెంచేందుకు సర్వ సభ్య సమావేశంలో తీర్మానించామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరను కృష్ణా మిల్క్ యూనియన్ చెల్లించబోతుందన్నారు.
పాడి రైతులకు బోనస్‌గా రూ.15 కోట్లు
డిసెంబర్ నుంచి మార్చి వరకు పాడి రైతులకు బోనస్‌గా రూ.15 కోట్లు చెల్లిస్తామని చలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.45 కోట్లు బోనస్‌గా రైతులకు చెల్లించామన్నారు. గత ఏడేళ్లలో కృష్ణా మిల్క్ యూనియన్ రూ.716 వార్షిక టర్నోవర్‌ను రూ.1,265 కోట్లకు పెంచామని, రూ.96 కోట్ల సమితి మిగులు నిధులను రూ.250 కోట్లకు చేర్చామని వివరించారు. సమితి స్థిరాస్తులను రూ.64 కోట్ల నుంచి రూ.320 కోట్లకు పెంచామన్నారు. వీరవల్లిలోని యూనియన్ కొత్త యూనిట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్లు సబ్సిడీ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, సమితి పాలక వర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, ఫీడ్ కమిటీ సభ్యులు, సంఘ అధ్యక్షులు, సమితి అధికారులు పాల్గొన్నారు.


