● వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి ● ఘనంగా ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. స్థానిక సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్‌లో శనివారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం సుమారు 80 సంఘాలతో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ బలోపేతమయిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దర్జీలు, ధోబీలు, ఆటో డ్రైవర్లు వంటి వివిధ చేతివృత్తుల కార్మికులకు ఏడాదికి రూ.10,000 నేరుగా లబ్ధి చేకూరిందని అన్నారు. యానిమేటర్ల వేతనాన్ని గత ప్రభుత్వం రూ.3,000 నుంచి రూ.10,000 కు పెంచారని, పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.8,000 నుంచి ఏకంగా రూ.21,000కు ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, ఫ్యాక్టరీల ద్వారా మరో 34 లక్షల మందికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధి కల్పించారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, కార్మిక వర్గాల సంక్షేమం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని గౌతం రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యాదల శ్రీనివాసరావు, జోనల్ ఇన్‌చార్జ్ ఎన్.రాజారెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ విశ్వనాథ రవి, రవీంద్ర రెడ్డి, బత్తుల గోవింద్, సామంతపూడి చిన్న, దుర్గాప్రసాద్, ప్రభు, వర్మ, కమ్మిలి రత్నకుమార్, బి.కిషోర్ పాల్గొన్నారు.


