ఇంజినీరింగ్‌ విద్యార్థికి కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ విద్యార్థికి కన్నీటి వీడ్కోలు

Mar 22 2026 2:10 AM | Updated on Mar 22 2026 2:10 AM

● నవదీప్‌కు కనుమూరులో అంత్యక్రియలు ● లభ్యమైన తేజజ్ఞసాయి మృతదేహం

ఉయ్యూరు: తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన ఏటిపాక మండలం పురుషోత్తపట్నం సమీపంలో కూనవరం వద్ద గోదావరి పాయలో స్నానానికి దిగి మృత్యువాత పడిన ఐదుగురిలో ఉయ్యూరుకు చెందిన తేజజ్ఞసాయి (20) మృతదేహం శనివారం లభించింది. భద్రాచలం రాముడి దర్శనానికి వెళ్లొస్తూ శుక్రవారం గోదావరి నదిలో విద్యార్థులు గల్లంతైన విషయం విదితమే.. నలుగురి మృతదేహాలు శుక్రవారమే లభించాయి. తేజజ్ఞసాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తాడిగడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తేజజ్ఞసాయి తండ్రి సౌతాఫ్రికా నుంచి వచ్చేందుకు సమయం పట్టే అవ కాశం ఉండటంతో భౌతికకాయాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తా నని చెప్పి విగతజీవిగా కళ్లముందున్న తమ బిడ్డను చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మరో ఇంజినీరింగ్‌ విద్యార్థి దగ్గుబాటి నవదీప్‌ (19) మృతదేహానికి స్వగ్రామమైన కనుమూరులో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి నవదీప్‌ మృతదేహం కుక్కనూరు వద్ద లభ్యంకాగా అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కనుమూరుకు తరలించారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నవదీప్‌ భౌతికకాయాన్ని సందర్శించి కన్నీటి పర్యంతం అయ్యారు. కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సహచర విద్యార్థులు గ్రామానికి చేరుకుని నవదీప్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. తమ స్నేహితుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక బోరున విలపించారు. అశ్రునయనాల నడుమ నవదీప్‌ భౌతికకాయాన్ని ఊరేగించి అంత్యక్రియలు జరిపించారు. ఇరువురి బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement