భక్తుల కోసం సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

భక్తుల కోసం సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయండి

Mar 22 2026 2:09 AM | Updated on Mar 22 2026 2:09 AM

దాసాంజనేయ దేవాలయానికి రజత కిరీటం

దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌
స్వయం ఉపాధిపై మహిళలకు అవగాహన

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): మాచవరం శ్రీదాసాంజనేయస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి కల్యాణ మహోత్సవానికి రామవరప్పాడుకు చెందిన దాత ప్రయాగ సీతారామశాస్త్రి అరకిలో వెండి రజత కిరీటాన్ని ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్‌ కృష్ణప్రసాద్‌కు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత ప్రయాగ సీతారామశాస్త్రి మాట్లాడుతూ కల్యాణోత్సంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మన్‌ కృష్ణప్రసాద్‌ ఆలయ అభి వృద్ధికి దాతల సహకారం మరువలేనిదన్నారు. అనంతరం అర్చకుడు సుబ్బయ్య ప్రత్యేక పూజలు చేసి దాతను స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతో సత్కరించారు. కార్యక్రమంలో ఈఓ పాతూరి లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన సమాచారం తెలియజేయడానికి సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ ఆదేశించారు. దుర్గగుడి అభివృద్ధి పనులను కమిషనర్‌ శనివారం పరిశీలించారు. కనకదుర్గనగర్‌ నుంచి ప్రారంభమయ్యే ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌, లడ్డూ పోటు, అన్నదాన భవనం పనులను పరిశీలించారు. లోటుపాట్లను గుర్తించిన కమిషనర్‌ ఇంజినీరింగ్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన సూచనలు పాటించకపోవడం సరికాదని, మళ్లీ తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దసరాకు పనులు ఓ కొలిక్కి రావాలని ఆదేశించారు. పనులపై ఆలయ ఈఈ–2 ఎల్‌.రమ కమిషనర్‌కు వివరించారు.

ఆలయ అధికారులతో సమీక్ష

అనంతరం కమిషనర్‌.. దుర్గగుడి అధికారులతో మూడు గంటలకు పైగా సమీక్షించారు. ఆలయ నిర్వహణ, భక్తులతో వ్యవహరించాల్సిన తీరుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. తిరుమల తరహాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని ఆదేశించారు. వాట్సాప్‌ ద్వారా టికెట్ల బుకింగ్‌ను 50 శాతం పైగా జరిగేలా చూడాలన్నారు. ఇటీవల ఆలయంలో జరిగిన కొన్ని సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో వీఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలాన్ని పూర్తిగా పార్కింగ్‌కు ఉపయోగించి అక్కడి నుంచి ఏసీ బస్సుల్లో భక్తులను కొండపైకి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించిన అంశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, చైర్మన్‌, బోర్డు సభ్యులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, సభ్యులు పాల్గొన్నారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ రూరల్‌ గొల్లపూడి మండలంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ రైజ్‌ కేంద్రం ఆధ్వర్యాన శనివారం నేటివ్‌ అరకు కాఫీపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సుమారు 102 మంది స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేటివ్‌ అరకు కాఫీ సంస్థ సీఈఓ కుమార్‌ వర్మ మాట్లాడుతూ.. ప్రస్తుత కాఫీ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. విలువ ఆధారిత కాఫీ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌పై సూచనలు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక సాధికారతకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. రైజ్‌ సంస్థ ద్వారా మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎ.ఎన్‌.వి.నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement